English | Telugu
కుంభకోణంలో నయన్ - విఘ్నేష్ స్పెషల్ పూజలు
Updated : Apr 6, 2023
తమ తనయుల ముఖాలను ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భంగా కుంభకోణం ఆలయంలో తలైవి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. బుధవారం తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఫ్లాష్ అయ్యారు నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్. కుంభకోణంలోని ఫేమస్ ఆలయానికి కారులో వెళ్లారు. ఈ ట్రిప్‌లో వాళ్లిద్దరూ తమ పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లలేదు. ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్పెషల్‌గా పూజలు చేశారు. వారిద్దరూ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విఘ్నేష్ శివన్ ప్యాంట్, బ్లూ షర్ట్, వైట్ జాకెట్ ధరించారు. నయనతార చుడిదార్‌లో ఫ్లాష్ అయ్యారు.
గతేడాది పెళ్లికి ముందు ఈ దంపతులు విఘ్నేష్ పూర్వీకుల ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉయిర్ రుద్రో నీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్ అని తమ ఇద్దరి కొడుకుల పేర్లను ఇటీవల చెప్పారు విఘ్నేష్ శివన్. పిల్లల పేర్లలో ఎన్ అంటే నయనతార అని, శివన్ అంటే తన పేరు అని కూడా వివరించారు విఘ్నేష్. నయనతార నటించిన కనెక్ట్ ఇటీవల విడుదలైంది. ఆమె ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్ గా జరిగి ఉంటే, ఈ పాటికి అజిత్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరక్షన్‌లో సినిమా మొదలై ఉండేది. మరోవైపు విఘ్నేష్, నయనతార కలిసి రౌడీ పిక్చర్స్ పతాకంపై గుజరాతీ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొఫెషనల్‌గా ఎవరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, విఘ్నేష్ - నయన్ సంప్రదాయాలను నిర్వర్తించడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. ముఖ్యంగా ఆలయాలను సందర్శిస్తున్న స్టార్ కపుల్‌గా వీరిద్దరికీ మంచి పాపులారిటీ ఉంది.