English | Telugu
నవదీప్ 'లవ్ మౌళి' టీజర్.. ఏంది సామి ఈ అరాచకం!
Updated : Nov 27, 2023
నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, సరికొత్తగా నవదీప్ 2.Oగా కనిపించబోతున్న చిత్రం 'లవ్ మౌళి'. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి సి స్పేస్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుదలైన ద ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది.
'లవ్ మౌళి' హీరో టీజర్ ను తాజాగా విడుదల చేశారు. నవదీప్ 2.O అనే ప్రచారానికి తగ్గట్టుగానే ఈ టీజర్ కొత్త నవదీప్ ని పరిచయం చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ నగ్నంగా నిల్చొని ఉన్న నవదీప్.. మందు బాటిల్ మూతని పగలకొట్టి, స్త్రీ లోదుస్తుల్లో మందు పోసుకొని తాగుతున్నట్టుగా అతని పాత్రని పరిచయం చేశారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో నవదీప్ కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రపంచంతో సంబంధం లేకుండా, తనకి తానే ప్రపంచం అన్నట్టుగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒంటరిగా తిరుగుతున్నట్టుగా నవదీప్ పాత్రని చూపించారు. ఇక చివరిలో హీరోయిన్ పాత్రని రివీల్ చేయడం బాగుంది.
సోమవారం హైదరాబాదులో జరిగిన టీజర్ ఆవిష్కరణ కార్యకమంలో హీరో నవదీప్ మాట్లాడుతూ "మనం లైఫ్‌లో ఎన్నో చేయలనుకుంటాం. కానీ జరిగేది వేరు. మనం పెట్టే పరుగులో ఆ విషయాన్ని గమనించం, అయితే ఎక్కడో ఒక దగ్గర ఆగి, ఆలోచిస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. అలా నేను కూడా వేరే వేరే సినిమాలు, అనవసరమైన సినిమాలు చేశాను. లాక్‌డౌన్ లో కొంత విరామం తీసుకుని నా వర్త్ ఏమిటో తెలుసుకున్నాను. ఆ కోవలోనే విన్న కథ ఇది. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు లవ్ మౌళి దగ్గరగా అనిపించింది. అందుకే మీ ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నాను" అన్నారు.
దర్శకుడు అవనీంద్ర మాట్లాడుతూ "నా లైఫ్ లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. నేను పాన్ ఇండియా లెవల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేషన్స్ వున్నాయి. నా స్వీయ అనుభవాలే ఈ సినిమా కథ" అన్నారు.
కథానాయిక పంఖురి గిద్వానీ మాట్లాడుతూ "చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇది. నా లైఫ్‌లో నేను చేయలేను అనుకున్న సాహసాలు అన్నీ ఈ చిత్రం షూటింగ్ టైమ్ లో చేశాను. ప్రేమ గురించి ఎంతో నిజాయితీగా బ్యూటీఫుల్‌గా చెప్పిన లవ్‌స్టోరీ ఇది. అందరం ఓ ఫ్యామిలీలా కలిసి ఈ చిత్రానికి పనిచేశాం" అని తెలిపారు.
పాటల రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ "నవదీప్ నగ్నసత్యంతో మొదలై వర్ణ విస్పోటనంగా మారి సినిమా సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంలో నవదీప్ తనకు తానే కొత్తగా ఆవిష్కరించుకుంటు నవదీప్ 2.0 గా కనిపించబోతున్నాడు" అన్నారు.
భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ కూడా అవనీంద్ర కావడం విశేషం.