English | Telugu
సరిపోదా శనివారం.. నాని ఉగ్రరూపం
Updated : Oct 23, 2023
నేచురల్ స్టార్ నాని తన 30వ సినిమా 'హాయ్ నాన్న'ని శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత తన 31వ సినిమాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేస్తున్నాడు నాని. 'అంటే సుందరానికీ' తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రమిది. దసరా కానుకగా తాజాగా ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం' అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. గ్లింప్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. సాయి కుమార్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ని రూపొందించారు. "ప్రతి మనిషికి ఒకరోజు వస్తుంది. అలాంటి రోజు ఒకడికి వారానికి ఒకసారి వస్తే.. వాడిని ఎవరైనా ఆపాలి అనుకోగలరా? అనుకున్నా ఆపగలరా?. శనివారం.. ప్రతి శనివారం.. సరిపోదు అంటారా?.." అనే వాయిస్ తో గ్లింప్స్ నడిచింది. ఇనుప గొలుసులతో బంధించబడిన నాని, వాటిని తెచ్చుకొని నిలబడటం ఆకట్టుకుంది. వాయిస్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో 'సరిపోదా శనివారం' గ్లింప్స్ పవర్ ఫుల్ గా ఉంది.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్నాడు. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నాడు.