English | Telugu
షాకింగ్.. నందమూరి తారకరత్న కన్నుమూత
Updated : Feb 18, 2023
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. గత నెల గుండెపోటుతో ఆసుపత్రి పాలైన ఆయన మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 23 రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని రేపు ఉదయం మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం 5 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నందమూరి తారక రామారావు కుమారుల్లో ఒకరైన మోహన కృష్ణ తనయుడు తారకరత్న. ఫిబ్రవరి 22, 1983న జన్మించిన ఆయన 19 ఏళ్ల వయసులో 'ఒకటో నంబర్ కుర్రాడు' చిత్రంతో 2002లో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు. యువరత్న, భద్రాద్రి రాముడు, నందీశ్వరుడు వంటి సినిమాల్లో నటించారు. 2009 లో విడుదలైన 'అమరావతి' చిత్రంలో విలన్ గా తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ చిత్రానికి గాను ఉత్తమ ప్రతినాయకుడుగా ఆయన నంది అవార్డు అందుకోవడం విశేషం.