English | Telugu
మరో ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్!
Updated : Feb 19, 2023
మెగాస్టార్ రీఎంట్రీలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలో వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి ఓకే అనిపించాయి. ఆచార్య డిజాస్టర్ అయింది. గాడ్ ఫాదర్ పర్వాలేదు అనిపించింది. వాల్తేరు వీరయ్య మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న దర్శకుడు మెహర్ రమేష్ తో 'భోళా శంకర్' చేస్తున్నారు. అలాగే చిరు, పూరి జగన్నాథ్ కు స్టోరీ రెడీ చేయమని చెప్పారు. ఇక ఈయన లిస్ట్‌లో త్రినాథరావు నక్కిన, మారుతి, కళ్యాణ్ కృష్ణ వంటి దర్శకులు ఉన్నారు. కృష్ణవంశీకి కూడ చిరు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన ఓ తమిళ దర్శకునితో నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. తెలుగు హీరో, తమిళ దర్శకుడు అనే ఫార్ములాను ప్రయత్నించాలని భావిస్తున్నారు. మరి ఇది ఏమైనా పాన్ ఇండియా మూవీనా లేక తెలుగు, తమిళంలో రూపొందే ద్విబాషా చిత్రమా? లేక కేవలం తెలుగుకే పరిమితమా? అనేది తెలియాల్సి వుంది.
ఇక పని చేయాలనుకుంటున్న ఆ తమిళ దర్శకుడు మరెవ్వరో కాదు. చిరు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఠాగూర్ ఒరిజినల్ వెర్షన్ రమణ తీసిన మురుగదాస్. అలాగే ఆయన దర్శకత్వంలో చిరంజీవి ఇప్పటికే స్టాలిన్ అనే చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇక మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ మూవీ కత్తి కి రీమేక్ గా రూపొందిన 'ఖైదీ నెంబర్ 150' తోనే చిరు రీఎంట్రీ ఇచ్చారు. ఇలా చిరు నటించిన మూడు చిత్రాలలో మురుగదాస్ ప్రమేయం ఉంది.
తాజాగా చిరు నేరుగా మురుగదాసుతోనే స్టాలిన్ తర్వాత రెండో చిత్రం చేయాలని యోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం మురుగదాస్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు. ఆయనకు గజిని సీక్వెల్ చేద్దామని అమీర్ ఖాన్ ఆఫర్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. మరోవైపు మురుగదాస్ కోలీవుడ్ యంగ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా ఓ చిత్రం చేయాలని భావిస్తున్నారు. అయితే శివకార్తికేయన్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్ వెంటనే లైన్ లోకి వస్తే ముందుగా శివకార్తికేయన్ చిత్రాన్ని మురుగదాస్ పూర్తిచేస్తాడు. ఆ తర్వాత చిరుతో చేస్తారు. శివకార్తికేయన్ సినిమా లేట్ అవుతుందని భావిస్తే మాత్రం మురుగదాస్ వెంటనే చిరుతో చిత్రం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.