English | Telugu
ఇది దేనికి దారి తీస్తుందోనని భయంగా ఉంది : నాగచైతన్య
Updated : Nov 7, 2023
రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సుసాధ్యం చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఫలానా టెక్నాలజీతో దీన్ని సృష్టించారు అని చెబితే తప్ప మనం చూసేది నిజమేనన్న భ్రమ కలిగించేంత పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇంతకుముందు కూడా రకరకాల టెక్నాలజీతో సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అంతకుమించి అన్నట్టు ఒక అడుగు ముందుకు వేసారు సైబర్ నేరగాళ్ళు. దానికి హీరోయిన్ రష్మిక మందన్న బలైంది. కురచ దుస్తులు ధరించిన ఒక అమ్మాయికి రష్మిక ఫేస్‌ను మార్ఫింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అంతే.. ఆ వీడియో చాలా పెద్ద వైరల్ అయిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమెకు బాసటగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,నాగచైతన్య నిలిచారు.
రష్మిక ఫేక్ వీడియోపై ఆందోళన వ్యక్తం చేసిన కవిత స్పందిస్తూ ‘‘సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన తక్షణ అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. రక్షణా చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయి సంఘాన్ని ఏర్పాటు చెయ్యాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదికి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు.
యువసామ్రాట్ నాగచైతన్య స్పందిస్తూ ‘‘టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరును చూస్తుంటే నిరుత్సాహంగా ఉంది. భవిష్యత్తులో ఇది దేనికి దారి తీస్తుందో తల్చుకుంటే భయంగా ఉంది. ఇలాంటి వాటిపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. ఘటనల కారణంగా బాధింపబడకుండా ఉండడానికి కఠిన చట్టాలను తీసుకురావాలి’’ అని ట్విట్టర్ పోస్ట్ పెట్టారు.