English | Telugu
దీపావళికి మీ ఇంట్లో రజనీ కాంత్
Updated : Nov 7, 2023
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా అగస్ట్ లో విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సినిమా జైలర్. ఈ మూవీతో రజనీ కాంత్ నటనకి ఉన్న సత్తా ఏ పాటిదో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల అందరికి తెలిసింది. సుమారు 600 కోట్ల రూపాయిల దాకా వసులు చేసిన జైలర్ మూవీకి సంబంధించిన తాజా వార్త రజనీ అభిమానులతో పాటు సినిమా అభిమానులని కూడా ఆనందంలో ముంచెత్తుతుంది.
జైలర్ గా రజనీ ఇప్పుడు బుల్లి తెర మీద తన సత్తాని చాటబోతున్నాడు. దీపావళి కానుకగా ఈ నెల 12 న జైలర్ మూవీ ప్రముఖ టెలివిజన్ ఛానల్ జెమినీలో ప్రసారం కాబోతుంది. తెలుగు, తమిళ,కన్నడ వెర్షన్స్ లో ఈ నెల 12 న సాయంత్రం 6 :30 నిమిషాలకి టెలికాస్ట్ అవ్వనుంది. హిందీ వెర్షన్ మాత్రం ఒక రోజు ముందు అంటే 11 వ తేదీ రాత్రి 7 గంటలకి స్టార్ గోల్డ్ ఛానల్ లో ప్రసారం కాబోతుంది. అయితే మలయాళలో మాత్రం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో అనే అప్ డేట్ లేదు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ జైలర్ మూవీ రజనీకాంత్ సినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం గా నిలిచింది. నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అయిన తన కొడుకుని సంఘవిద్రోహ శక్తులు చంపారని తెలుసుకొని తన కొడుకుని చంపిన వాళ్ళని చంపాలనుకొని బయలుదేరిన తండ్రికి చివరికి తన కొడుకే సంఘవిద్రోహ శక్తి అని తెలిసి ఆ కొడుకుని చంపుకునే క్యారక్టర్ లో రజనీ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా రజనీ వీర విహారం చేసాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లు నటించిన ఈ జైలర్ మూవీ లో రజనీ భార్య గా రమ్య కృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో తమన్నా ,సునీల్ లు నటించగా అనిరుద్ సంగీత సారథ్యం వహించాడు.