English | Telugu
బాలయ్య కోసం నిర్మాత ఊహించని త్యాగం!
Updated : Oct 3, 2023
సాధారణంగా నిర్మాతలు తాము నిర్మించిన, తాము రైట్స్ తీసుకున్న సినిమాల రిలీజ్, థియేటర్ల విషయంలో కాస్త స్వార్థంగా ఉంటారు. అలా ఉండకపోతే నష్టాలు చూడాల్సి వస్తుందనేది వారి భయం. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం తాను విడుదల చేస్తున్న సినిమా కంటే కూడా, తన అభిమాన హీరో నటించిన సినిమానే ముఖ్యమని అంటున్నారు.
పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. ఈ దసరాకు అలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశముంది. అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి', 'లియో', అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఒకేరోజు విడుదల కానున్న 'భగవంత్ కేసరి', 'లియో' విషయంలో థియేటర్ల సమస్య తలెత్తే ఛాన్స్ ఉంది. అయితే తమిళ మూవీ 'లియో' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని తీసుకున్న నిర్మాత నాగవంశీ మాత్రం.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'కి థియేటర్ల సమస్య రానివ్వను అంటున్నాడు.
"లియో రైట్స్ ని నేను తీసుకోవడమే బెటర్. బాలయ్య భగవంత్ కేసరికి థియేటర్ల విషయంలో ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను" అని తాజాగా నాగవంశీ అన్నాడు. తన సినిమా విడుదలవుతున్నా, అభిమాన హీరో సినిమాకి థియేటర్ల లోటు రానివ్వకుండా చూస్తానని నాగవంశీ చెప్పడంపై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.