English | Telugu
సలార్.. నాగ చైతన్య సర్ ప్రైజ్ ఎంట్రీ!
Updated : Dec 8, 2023
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అనే సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చైతన్య మత్స్యకారుడుగా కనిపించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన చైతన్య ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల కానుందని తెలుస్తోంది.
'తండేల్' ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న చందు మొండేటి.. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ని వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఆ వేగానికి తగ్గట్టుగానే అప్పుడే మేకర్స్ గ్లింప్స్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే గ్లింప్స్ కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిందని సమాచారం.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' మొదటి భాగం 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో 'తండేల్' గ్లింప్స్ ని ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే 'తండేల్' సినిమా ఒక్కసారిగా ఎందరో ప్రేక్షకులకు చేరువ అవుతుంది అనడంలో సందేహం లేదు.