English | Telugu
'కన్నప్ప' విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన మంచు విష్ణు!
Updated : Sep 25, 2023
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో ఎందరో స్టార్స్ నటించనున్నారని, ముఖ్యంగా శివపార్వతులుగా ప్రభాస్, నయనతార నటించనున్నారనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అధికారిక ప్రకటన రానప్పటికీ కన్నప్పలో ప్రభాస్, నయనతార నటిస్తున్నారనే వార్త వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన విష్ణు.. 'కన్నప్ప' గురించి ఆసక్తికర విషయాలని పంచుకోవడంతో పాటు, ఊహించని షాకిచ్చాడు.
"న్యూజిలాండ్ లో కన్నప్ప షూటింగ్ ప్రారంభించనుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆ శివపార్వతుల దీవెనలతోనే నా ఏడేళ్ల కల సాకారమవుతోంది. మొదట తనికెళ్ళ భరణి గారు ఈ కాన్సెప్ట్ ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆ తరువాత పలువురి సహకారంతో కథ మెరుగులు దిద్దుకుంది. 'కన్నప్ప'కి ప్రాణం పోసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు న్యూజిలాండ్ కి రాబోతున్నారు.
'కన్నప్ప'లో ఎందరో సూపర్ స్టార్ లు భాగం కానున్నారు. ఆ వివరాలను స్వయంగా ప్రకటించడం నాకెంతో ఆనందాన్నిస్తుంది. కానీ ఆ వివరాలను కొందరు ముందే లీక్ చేస్తున్నారు. నటీనటులకు సంబంధించి ప్రొడక్షన్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని మా సినీ అభిమానులందరినీ నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను." అని విష్ణు రాసుకొచ్చాడు.
ఇప్పటిదాకా 'కన్నప్ప'లో ప్రభాస్, నయనతార నటించడం ఖాయమని భావించారంతా. కానీ ఇప్పుడు విష్ణు, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ట్వీట్ చేయడంతో.. ప్రభాస్, నయనతార వార్తలపై సందేహం వ్యక్తమవుతోంది.