English | Telugu
అక్కడ రామ్, బెల్లంకొండ.. ఇక్కడ మహేష్!
Updated : Sep 8, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించారు. తాజాగా ఆయన ఖాతాలో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'శ్రీమంతుడు' యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ సాధించింది.
మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కలయికలో వచ్చిన మొదటి సినిమా 'శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2015, ఆగస్టు 7న విడుదలై అప్పట్లో నాన్-బాహుబలి హిట్ గా నిలిచింది. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలోనే కాదు.. డిజిటల్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఏకంగా 200 కి పైగా మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగు సినిమాల వ్యూస్ పరంగా యూట్యూబ్ లో ఇదొక సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు.
అయితే హిందీలోకి డబ్ అయ్యి యూట్యూబ్ లో విడుదలైన తెలుగు సినిమాల్లో 200 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలు 500 మిలియన్లకి పైగా వ్యూస్ కూడా సాధించాయి. అయితే తెలుగు వెర్షన్ పరంగా మాత్రం 200 మిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సినిమాగా శ్రీమంతుడుదే రికార్డు.