English | Telugu
హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు సీరియస్... అసలేం జరిగింది?
Updated : Oct 13, 2023
హీరో విశాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలోనో లేదా ఏదో ఒక కేసులోనో.. మరేదో సమస్యల్లోనో ఇరుక్కుంటూ ఉంటాడు. భారీ చిత్రాల ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్‌తో విశాల్‌కు గత కొంతకాలంగా డబ్బు లావాదేవీల విషయంలో గొడవ జరుగుతోంది. ఈ విషయమై లైకా సంస్థ విశాల్‌పై కేసు పెట్టింది. కొంతకాలంగా ఈ కేసు విచారణ జరుగుతోంది. కొన్ని వాయిదాల తర్వాత ఇటీవల ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విశాల్ ఎకౌంట్‌లో డబ్బు ఉన్నప్పటికీ తమకి చెల్లించడం లేదని లైకా తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. ఆయన కోర్టుకు సమర్పించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని బట్టి తెలుస్తోందని ఆ న్యాయవాది పేర్కొన్నారు. తమకు ఇవ్వాల్సిన మొత్తంలో సగమైనా డిపాజిట్ చేసేలా విశాల్‌ను ఆదేశించాలని ఆ న్యాయవాది కోర్టును కోరారు.
దీనిపై స్పందించిన విశాల్ తరఫు న్యాయవాది తాము సమాధానం ఇవ్వడానికి కొంత గడువు కావాలని కోర్టును కోరారు. దీంతో విశాల్‌పై సీరియస్ అయిన మద్రాస్ హైకోర్టు లైకాకు డబ్బు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. దానికి విశాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. తాము డబ్బు చెల్లించేందుకు సిద్ధంగానే ఉన్నామని, అయితే లైకా సంస్థ చర్చలకు రావడం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును నవంబర్ 1కి వాయిదా వేశారు.