English | Telugu
శర్వానంద్ సినిమాకి లీగల్ సమస్యలు!
Updated : Oct 27, 2023
గతేడాది 'ఒకే ఒక జీవితం' సినిమాతో ఆకట్టుకున్న టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు లీగల్ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్ లో 'సామజవరగమన' చిన్న సినిమాగా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించిన ఈ కామెడీ ఫిల్మ్ తో దర్శకుడు రామ్ అబ్బరాజు అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సినిమా సమయంలోనే అనిల్ సుంకర లేదా రాజేష్ దండా నిర్మాణంలో రెండో సినిమా కూడా చేసేలా దర్శకుడు రామ్ అబ్బరాజు చేత అగ్రిమెంట్ చేసుకున్నారట. కానీ ఇప్పుడు రామ్ అబ్బరాజు అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి, వేరే బ్యానర్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతుండటంతో నిర్మాతలు అనిల్ సుంకర, రాజేష్ దండా ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.