English | Telugu
శ్రీదేవి రెండో కుమార్తె కోలీవుడ్ ఎంట్రీ
Updated : Sep 15, 2023
సౌత్‌తో పాటు నార్త్‌లోనూ అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన దివంగత అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె కుమార్తె జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన జాన్వీ.. 'దేవర' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కూడా సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న సినిమా ద్వారా ఖుషి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ సౌత్ ఎంట్రీ ఇవ్వటానికి చాలా సమయాన్నే తీసుకున్నప్పటికీ ఖుషి కపూర్ మాత్రం ఎక్కువ సమయం తీసుకోలేదు. అథర్వ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆకాష్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారు.
సీనియర్ దివంగత తమిళ నటుడు మురళి తనయుడైన అథర్వ తమిళంలో సుపరిచిత నటుడే. తెలుగులోనూ గద్దలకొండ గణేష్ చిత్రంలో నటించి మెప్పించారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. అలాగే సినిమా అంతటినీ అమెరికాలో చిత్రీకరిస్తారని సమాచారం. అథర్వ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అర్చీస్ అనే బాలీవుడ్ సినిమాలో ఖుషి ఇప్పటికే నటించింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అమ్మడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోంది. మరో వైపు తమిళంలో ఘన విజయం సాధించిన లవ్ టుడే హిందీ రీమేక్‌లోనూ ఈమె కథానాయికగా నటించింది.
ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే కోలీవుడ్ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించనుంది ఖుషి కపూర్. బోనీ సైతం ఈ మధ్య సౌత్ సినిమాలతో అనుబంధం పెంచుకున్నారు. తమిళంలో వళిమై, తునివు చిత్రాలకు నిర్మాతగా .. తెలుగులో వకీల్ సాబ్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారు మరి.