English | Telugu
'కింగ్ ఆఫ్ కొత్త' రివ్యూ: ఇదెక్కడి ల్యాగ్ రా నాయనా..!!
Updated : Aug 24, 2023
సినిమా పేరు: కింగ్ ఆఫ్ కొత్త
తారాగణం: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, ప్రసన్న, షబీర్ కల్లారక్కల్ (డాన్సింగ్ రోజ్), అనిఖా సురేంద్రన్, నైలా ఉష, శరణ్ శక్తి, షమ్మి తిలకన్, గోకుల్ సురేశ్, శాంతి కృష్ణ, ధ్రువ్ విక్రమ్ (అతిథి పాత్ర), రితికా సింగ్ (స్పెషల్ సాంగ్) తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్, షాన్ రెహ్మాన్
సినిమాటోగ్రాఫర్: నిమిష్ రవి
ఎడిటర్: ఉమాశంకర్ శతపతి
రచన: అభిలాష్ ఎన్. చంద్రన్
దర్శకత్వం : అభిలాష్ జోషి
బ్యానర్స్: వేఫరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్
విడుదల తేదీ: ఆగస్టు 24, 2023
చిత్ర నిడివి: 175 నిమిషాలు (2 గంటల 55 నిమిషాలు)
'మహానటి', 'సీతారామం' చిత్రాలతో తెలుగువారికి చేరువైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. తాజాగా 'కింగ్ ఆఫ్ కొత్త'తో పలకరించాడు. ప్రధానంగా మలయాళంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. గురువారం (ఆగస్టు 24) తెలుగులోనూ విడుదలైంది. నూతన దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? దుల్కర్ ఖాతాలో మరో హిట్ చేరిందా? తెలుసుకునేముందు రివ్యూలోకి వెళదాం..
కథాంశం:
ఓపెన్ చేస్తే.. అది కేరళలోని కొత్త అనే ఊరు. 1980ల నాటి నేపథ్యం. రాజు (దుల్కర్ సల్మాన్) చాలా సాధారణ స్థాయి నుండి మాఫియా డాన్ రేంజ్ కి ఎదుగుతాడు. ఇలా ఎదిగే క్రమంలో.. మరెన్నో గ్యాంగులను మట్టి కరిపిస్తాడు. పోలీసులకు, పొలిటికల్ లీడర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు. దీంతో.. రాజుని టార్గెట్ చేసుకుంటారు. ఇటు గ్యాంగుల నుంచి, అటు పోలీస్ - పొలిటికల్ లీడర్ల నుంచి రాజు తనని తాను ఎలా కాపాడుకున్నాడు? చివరకి అతని కథ ఏ తీరాలకి చేరింది? అన్నదే సినిమా.
విశ్లేషణ:
కింగ్ ఆఫ్ కొత్త.. ఓ పిరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా. మనం ఎన్నో సార్లు చూసిన, విన్న కథతోనే తెరకెక్కింది. దీనికి తోడు భారీ నిడివి శిరోభారంగా మారింది. ప్రథమార్ధంతో పోలిస్తే.. సెకండాఫ్ లో పాత్రల ఇంటెన్సిటీ తగ్గింది. దర్శకుడికిదే తొలి చిత్రం కావడంతో.. ఆ అనుభవ లేమి అడుగడుగున కనిపించింది. అయితే, నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల సహకారం తోడవడంతో సినిమా ఫర్లేదు అనిపిస్తుంది. మరీముఖ్యంగా.. దుల్కర్, షబీర్ మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది. నిమిష్ రవి విజువల్స్ ఆకట్టుకుంటాయి. 80ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్ట్ వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. ఎడిటింగ్ మాత్రం మరింత పదునుగా ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది.
నటీనటుల పనితీరు:
దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే తన పాత్రలో ఒదిగిపోయి.. సహజ నటనతోదుమ్ము దులిపాడు. అలాగే షబీర్ (డాన్సింగ్ రోజ్) కూడా చెలరేగిపోయాడు. ధ్రువ్ విక్రమ్ అతిథి పాత్రలో మెరిసి.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఐశ్వర్య లక్ష్మికి నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో అలరించే ప్రయత్నం చేసింది. రితికా సింగ్ ప్రత్యేక గీతంలో చిందులతో, అందాల విందుతో సందడి చేసింది.
ప్లస్ పాయింట్స్:
నేపథ్య సంగీతం, సెట్టింగ్స్, నటీనటులు, సాంకేతిక విలువలు
మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్, సినిమా నిడివి, రొటీన్ కాన్సెప్ట్
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
గ్యాంగ్ స్టర్ డ్రామాలను ఇంటెన్సిటీతో, క్రిస్పీ రన్ తో తెరకెక్కిస్తే.. సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు.. ఈ సినిమాలో ఆ రెండు లోపించాయి. దర్శకుడు అభిలాష్ ఎంచుకున్న కథనంలో పెద్దగా మలుపులు లేకపోవడం వల్ల కూడా 'కింగ్ ఆఫ్ కొత్త'లో కొత్తదనం లోపించింది. అన్నింటికంటే ల్యాగ్ ఎక్కువై.. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా? అనిపించేలా చూసింది. దుల్కర్, షబీర్ పెర్ఫార్మెన్స్, సాంకేతిక విలువల కోసం ఓ సారి చూసే ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్ గా మాత్రం.. ఇదెక్కడి ల్యాగ్ రా నాయనా అనుకోవడం ఖాయం.
రేటింగ్: 2/5