English | Telugu
'విక్రమ్'తో 'జైలర్' జట్టు.. స్టార్ డైరెక్టర్ క్రేజీ స్కెచ్.. !
Updated : Aug 17, 2023
'విక్రమ్'తో గత ఏడాది సంచలన విజయం అందుకున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. ఇక 'జైలర్'తో ఈ సంవత్సరం అంతకుమించి సక్సెస్ చూస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. 60 ప్లస్ లోనూ ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్.. ఇలా సెన్సేషనల్ హిట్స్ అందుకోవడం వార్తల్లో నిలుస్తోంది.
ఇదిలా ఉంటే, కెరీర్ ప్రారంభంలో పలు మల్టిస్టారర్స్ లో సందడి చేసిన ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు.. చాలా కాలం తరువాత మరోసారి జట్టుకట్టనున్నారట. అది కూడా.. ఒక లెజెండరీ డైరెక్టర్ తెరకెక్కించనున్న సినిమా కోసం. ఆ వివరాల్లోకి వెళితే.. 'పొన్నియన్ సెల్వన్' సిరీస్ తరువాత మణిరత్నం మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో రజినీకాంత్ ని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే గనుక నిజమైతే 'విక్రమ్'తో 'జైలర్' జట్టుకట్టడం ఆసక్తి రేకెత్తించే అంశమనే చెప్పాలి. త్వరలోనే కమల్, రజినీ కాంబోపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో 'నాయకుడు' అనే క్లాసిక్ చేశారు కమల్. ఇక రజినీకాంత్ విషయానికి వస్తే.. 'దళపతి' వంటి బ్లాక్ బస్టర్ చేశారు. మరి.. వేర్వేరుగా మణిరత్నంతో మంచి హిట్స్ అందుకున్న కమల్, రజినీ.. కాంబో మూవీతోనూ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.