English | Telugu
‘ఇండియన్ 2’ రిలీజ్ విషయంలో క్లారిటీ
Updated : Sep 9, 2023
స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓ వైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో వైపు యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో ఇండియన్ ను రూపొందిస్తున్నారు. నెలలో కొన్ని రోజులు చరణ్ సినిమాకు, కొన్ని రోజులు కమల్ హాసన్ సినిమాకు సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ముందుగా రామ్ చరణ్‌తో చేస్తోన్న గేమ్ చేంజర్ విడుదలవుతుందని సినీ సర్కిల్స్ టాక్. వచ్చే ఏడాది సమ్మర్‌లోనే ఈ సినిమా రిలీజ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియా సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇండియన్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇన్ని రోజుల క్లారిటీ లేకుండా ఉండింది. తాజాగా దీనిపై కూడా ఓ క్లారిటీ వస్తుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ వారంలో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా కచ్చితమైన డేట్ అయితే ఫిక్స్ కాలేదనేది సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టే ఇండియన్ 2ను ఆగస్ట్‌లో రిలీజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
1996లో ఇండియన్ మూవీ రిలీజైంది. మన దేశంలో లంచగొండితనంపై బ్రిటీష్ వారిని ఎదిరించిన సేనాని అనే వ్యక్తి మరి ఈ సీక్వెల్‌లో దేనిపై తన పోరాటాన్ని కొనసాగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ 2లో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ పాత్రకు ధీటుగా కాజల్ అగర్వాల్ పాత్ర ఉంటుందని సమాచారం. ఆమె ఇండియన్ 2 కోసం మార్షల్ ఆర్ట్స్ సైతం నేర్చుకుని మరీ నటించింది.