English | Telugu
వడివేలు చుట్టూ కమల్ రాజకీయం!
Updated : Jul 22, 2023
కోలీవుడ్ స్టార్ కమెడియన్స్‌లో వడివేలు శకాన్ని ఎవరూ మరచిపోలేరు. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈయన మధ్యలో కొన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరంటూ ఉంటూ వచ్చారు. అయితే ఈమధ్య మళ్లీ ఆయన సినిమాల్లో దూకుడుని పెంచారు. ఈ ఏడాది ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి వడివేలు నటించిన చిత్రం `మామన్నన్` (తెలుగులో `నాయకుడు`) మంచి విజయాన్ని సాధించింది. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో వడివేలు చాలా సీరియస్ పాత్రలో నటించారు. అది కూడా ఓ రాజకీయ నాయకుడిగా. `మామన్నన్` మూవీలో వడివేలు వెనుకబడిన వర్గానికి చెందిన రాజకీయ నాయకుడిగా నటించారు.
కాగా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు `ఇండియన్ 2` సినిమాలో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండానే కమల్ హసన్, ప్రొడ్యూసర్‌గా మారి వడివేలు ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే ఇదొక పొలిటికల్ డ్రామా. గత ఎన్నికల్లో కమల్ హాసన్‌ను వడివేలు రాజకీయంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మన స్టార్ హీరో నిర్మాతగా మారి వడివేలుతో సినిమాను రూపొందించనున్నారు. మరి రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని ఉంటుందా? లేక నేటి రాజకీయాలను విమర్శించేలా ఉండనుందా..అసలు వడివేలు చుట్టూ కమల్ చేస్తున్న రాజకీయాల అసలు మ్యాటర్ ఏంటనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన శంకర్ దర్శకత్వంలో `ఇండియన్ 2` మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది కాకుండా ప్రాజెక్ట్ కె చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా.. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు కమల్ హాసన్.