English | Telugu
చార్లీ చాప్లిన్ కుమార్తె జోసఫిన్ మృతి
Updated : Jul 22, 2023
కామెడీ లెజెండ్ చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. నిజానికి ఆమె పారిస్‌లో జూలై 13నే మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
జోసఫిన్ 1949 మార్చి 28న కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతామోనికాలో జన్మించారు. చార్లీ చాప్లిన్, ఊనా ఓ'నీల్ దంపతుల ఎనిమిదిమంది సంతానంలో ఆమె మూడోవారు. తన తండ్రి తీసిన 'లైంలైట్' (1952) సినిమాలో నటించడం ద్వారా మూడేళ్ల వయసులోనే ఆమె కెరీర్ ప్రారంభించారు. ఆమెకు ముగ్గురు కుమారులు - చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్ ఉన్నారు.
అనేక సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. 1972లో పియర్ పవోలో పాసోలిని తీసిన అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'ద కాంటర్‌బరీ టేల్స్', రిచర్డ్ బాల్డుక్సి సినిమా 'లోడియర్ డెస్ ఫావెస్'లో నటించారు. అదే యేడాది మేనహెం గోలన్ మూవీ 'ఎస్కేప్ టు ద సన్'లో లారెన్స్ హార్వేతో కలిసి నటించారు.
తర్వాత కాలంలో ఆమె 1984లో కెనడా డ్రామా ఫిల్మ్ 'ద బే బాయ్'లోనూ, 1988లో టీవీ మిని సిరీస్ 'హెమింగ్‌వే'లోనూ ఆమె కీలక పాత్రలు చేశారు.