English | Telugu
నిర్మాతలకు ఆదర్శంగా నిలుస్తున్న కళానిధి మారన్!
Updated : Sep 6, 2023
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించి పెద్ద విజయాన్ని అందుకున్న కళానిధి మారన్ ఆ తర్వాత రజనీతోనే చేసిన ‘పేట’, ‘అన్నాత్తై’ చిత్రాల వల్ల ఎంతో నష్టపోయాడు. తాజాగా రజనీ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో నిర్మించిన ‘జైలర్’ ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు తమిళ్‌లో ఇలాంటి ఘనవిజయం నమోదు కాలేదు. అంతటి ఘన విజయంలో కీలక పాత్రలు పోషించిన రజనీకాంత్, నెల్సన్, అనిరుధ్‌లకు చెక్‌లు, బహుమతులు అందించి తన ఆనందాన్ని వారితో పంచుకున్నారు మారన్.
అంతటితో ఆగకుండా తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగించేందుకు ముందుకొచ్చారు మారన్. సన్ పిక్చర్స్ తరఫున కళానిధి మారన్ భార్య కావేరి ఇటీవల అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్, ఉపాసన కొణిదెల తాతగారైన డా॥ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్‌ను అందించారు. 100 మంది నిరుపేద పిల్లల గుండె ఆపరేషన్ కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. సన్ పిక్చర్స్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఎంతో మంది నిర్మాతలకు కళానిధి మారన్ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు సమాజానికి ఎంతో అవసరం అంటున్నారు. సన్ పిక్చర్స్‌లో మరిన్ని మంచి సినిమాలు రావాలని, మంచి లాభాలు ఆర్జించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.