English | Telugu
ఆ హీరోలకు అంతటి ఉలికిపాటు అవసరమా?
Updated : Sep 6, 2023
అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు పైరసీ పైన మన హీరోలు పోరాటం చేసేవారు. అంటే అన్ని సినిమాల కోసం కాదు, తమ సినిమా రిలీజ్ అయినపుడు మాత్రమే పైరసీ చేస్తున్న వారిపై విరుచుకుపడేవారు. తమ సినిమా థియేటర్ల నుంచి తీసేసిన తర్వాత హీరోలు తమ పోరాటాన్ని కూడా పక్కన పెట్టేవారు. ఎవరి సినిమా రిలీజ్ అయితే వాళ్ళే దాని గురించి మాట్లాడేవారు. అంటే పక్క హీరోల సినిమాలు పైరసీ అయినా, దానివల్ల నిర్మాతలు నష్టపోయినా వీరికి పట్టదు, వీరు నష్టపోయినా వారికి పట్టదు. ఈ విషయంలో ఎవరి దారి వారిది అన్నట్టుగా అప్పట్లో వుండేవారు.
ఇప్పుడు అదే ఫార్మాట్‌ని సోషల్ మీడియా విషయంలో, వెబ్‌సైట్స్ విషయంలో అప్లయ్ చేస్తున్నారు. తమ సినిమాలను కిల్ చేస్తున్నారని, ఫేక్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి నెగెటివ్ రివ్యూలు రాయిస్తున్నారని, తమ సినిమాపై దాడులు చేస్తున్నారని.. ఇలా రకరకాల ఆరోపణలు బాహాటంగానే చేస్తున్నారు. ఇటీవల ‘ఖుషి’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విజయ్ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేశాడు. దానికి సపోర్ట్‌గా కిరణ్ అబ్బవరం కూడా తనకు తోచిన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం అనేది కేవలం ఆయా సినిమాలకు ఇచ్చే రేటింగ్‌పై ఆధారపడి ఉండదని హీరోలు గుర్తించాలంటున్నారు. ఎందుకంటే ఎంతో గొప్పగా ఉందంటూ ఎక్కువ రేటింగ్ ఇచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అస్సలు బాగా లేదని రాసిన సినిమాలు సూపర్‌హిట్ అయిన నందర్భాలూ ఉన్నాయి. దీన్నిబట్టి ఒక సినిమాలో విషయం ఉంటే వెబ్‌సైట్లు ఇచ్చే రేటింగ్స్ ప్రభావం దాని మీద ఏమాత్రం ఉండదని అర్థమవుతూనే ఉంది. ఏదో విధంగా వార్తల్లో ఉండాలి, తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలనే ధోరణే తప్ప వాస్తవాలను గ్రహించలేకపోవడం విచారించాల్సిన విషయమే.
ఒక మంచి ప్రయత్నం చేశారు, ఒక మంచి సినిమా తీశారు అంటే దాన్ని చంపే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. వీలైనంతగా ఆ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే ప్రయత్నిస్తారు. ఈ విషయాన్ని గ్రహించకుండా మైక్ దొరికింది కదా అని ఆరోపణలు చేస్తే అది ఎవరికి నష్టం? అందుకే దర్శకనిర్మాతలైనా, హీరోలైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాని చెయ్యడంలో, ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తియ్యడంలో దృష్టి పెడితే బాగుంటుంది.