English | Telugu
డీప్ ఫేక్ వీడియో : నిన్న రష్మిక.. నేడు కాజోల్.. ఆందోళనలో సెలబ్రిటీలు!
Updated : Nov 17, 2023
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దాని వల్ల మంచి ఎంత జరుగుతుందో, చెడు కూడా అంతే జరుగుతుందని గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎఐ టెక్నాలజీ వల్ల సెలబ్రిటీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరి ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రష్మిక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది ఇద్దరు నిందితులపై కేసులు కూడా పెట్టామని పోలీసులు చెబుతున్నారు.
తాజాగా మరో వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్, హీరో అజయ్ దేవ్‌గణ్ భార్య కాజోల్ ఫేక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టుగా ఉన్న ఈ వీడియో సెలబ్రిటీలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇలాంటి ఫేక్ వీడియోల నుంచి ఎలాంటి రక్షణ కల్పించలేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోల గురించి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలకు కొన్ని సూచనలు చేసింది. ఫేక్ వీడియో, అభ్యంతరకర వ్యాఖ్యల గురించి రిపోర్ట్ చేసిన 36 గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. కానీ, దానివల్ల ఎలాంటి ఉపయోగం జరగడం లేదని నిపుణులు అంటున్నారు. ఈ తరహా వీడియోలను షేర్ చేయకూడదని, అది చట్టరీత్యా నేరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.