English | Telugu
చాలా విషయాల్లో మోసపోయాను.. అయితే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే!
Updated : Nov 17, 2023
సింగర్ సునీత గురించి తెలియని వారుండరు. ఎన్నో సినిమాల్లో మధురమైన పాటలు పాడిన ఆమె టీవీలో కూడా ఎన్నో షోలు చేశారు. ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. సింగర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయిన సునీత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వ్యక్తిగత సమస్యలతో ఎంతో సతమతమయ్యారు, ఎంతో ఆవేదన చెందారు. 45 ఏళ్ళ సునీత 17 ఏళ్ళకే ఇండస్ట్రీకి వచ్చి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. చాలా కాలం ఒంటరిగానే ఉన్న సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడాన్ని పలువురు విమర్శించారు. అయితే ఆమెకు ఎంతో ప్రముఖులు అండగా నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని విషయాల గురించి మాట్లాడారు.
‘‘ఎవరి జీవితంలోనైనా ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం. అయితే వాటి నుంచి మనం ఎలా బయటపడ్డాం అనేది ముఖ్యం. జీవితంలో చాలా విషయాల్లో నేను మోసపోయాను. చాలా విషయాల్లో నాపై వచ్చిన విమర్శలకు లెక్కే లేదు. 17 ఏళ్లకే కెరీర్ ఇండస్ట్రీకి వచ్చాను. 19 ఏళ్లకే పెళ్లి, సంపాదన. కుటుంబ బాధ్యత తీసుకున్నాను. 21 ఏళ్ల వయసులో కొడుకు, 24 ఏళ్లకు కూతురు పుట్టింది. నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు. ఉన్న ఇల్లు కూడా పోయింది. 35 ఏళ్ళు వచ్చే వరకు కష్టపడుతూనే ఉన్నాను. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు. మోసపోయానని తెలిశాక ఆశ్చర్యం వేసేది. 28 ఏళ్ల కెరీర్లో 5 వేలకు పైగా షోలు చేశాను. నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా అంటే ఏడ్చేస్తాను. నేను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం రెండో వివాహం చేసుకోవడం‘‘ అని వివరించింది సునీత.
సునీత మొదటి భర్త సంతానంగా ఆకాష్, శ్రేయ ఉన్నారు. శ్రేయ తల్లి మాదిరి సింగర్‌గా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఆకాష్ హీరోగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. సునీత భర్త రామ్ నిర్మించే సినిమా ద్వారా ఆకాష్‌ను హీరోగా పరిచయం చెయ్యాలని భావిస్తున్నాడట. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలీదు. ఆకాష్ హీరోగా రామ్ సినిమా నిర్మించనున్నాడనే వార్తలు మాత్రం ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది.