English | Telugu
జూనియర్ ఎన్టీఆర్ ది మామూలు అదృష్టం కాదుగా!
Updated : Sep 26, 2023
స్టార్ హీరోలు నటించే భారీ బడ్జెట్ సినిమాలకు సరైన రిలీజ్ డేట్ ని ఎంచుకోవడం కీలకం. మొదటి వారం కలెక్షన్స్ పై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చూసుకోవాలి. అది జరగాలంటే హాలిడేస్ కలిసొచ్చే డేట్ ని ఎంచుకోవడంతో పాటు, పోటీలో ఇతర భారీ సినిమాలు లేకుండా చూసుకోవాలి. 'దేవర' చిత్రానికి అలాంటి పర్ ఫెక్ట్ డేట్ కుదిరింది.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'దేవర'. తనకు గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చిన 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకి అదిరిపోయే రిలీజ్ డేట్ ని ఎప్పుడో లాక్ చేసేశారు. ఈ చిత్రం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. 5న రిలీజ్ డేట్, 6-7 వీకెండ్, 9న ఉగాది, 10న ఈద్, 13-14 సెకండ్ వీకెండ్, 17న శ్రీరామ నవమి.. ఇలా మొదటి రెండు వారాల్లో పలు సెలవులు వచ్చేలా సూపర్ డేట్ ని లాక్ చేసింది దేవర టీం.
అయితే ఇంత మంచి డేట్ ని మిగతా వారు మాత్రం ఎందుకు వదులుకుంటారు. అందుకే పలు పెద్ద సినిమాలు ఆ డేట్ పై కన్నేసినట్టు బాగానే వార్తలొచ్చాయి. మొదట ఈ డేట్ కి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వచ్చే ఛాన్స్ ఉందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే, అప్పటికి ఆ సినిమా షూటింగ్ పూర్తయితే గొప్పే. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ 'పుష్ప-2' అన్నారు. కానీ ఆ సినిమా ఆగస్టుకి వెళ్ళిపోయింది. ఇటీవల ప్రభాస్ 'సలార్' అన్నారు. కానీ ఇప్పుడది ఈ డిసెంబర్ 22 న విడుదల కావడం ఖాయమంటున్నారు. అసలే మంచి రిలీజ్ డేట్, దానికి తోడు ఇతర భారీ సినిమాల పోటీ లేకపోవడం దేవరకి లక్ అనే చెప్పొచ్చు.