English | Telugu
ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ 'ఆంధ్రావాలా' రీరిలీజ్!
Updated : Mar 9, 2023
కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ సినిమాలనో లేదా ఫ్యాన్స్ థియేటర్లలో గోల చేసే సినిమాలనో రీరిలీజ్ చేస్తున్నారు. 'జల్సా', 'పోకిరి', 'చెన్నకేశవరెడ్డి', 'ఖుషి', 'ఒక్కడు' వంటి సినిమాలు రీరిలీజ్ లోనూ మంచి వసూళ్లతో సత్తా చాటాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో నటించిన 'ఆది', 'సింహాద్రి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రీరిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిన 'ఆంధ్రావాలా'ను మళ్ళీ విడుదల చేయడానికి సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆంధ్రావాలా'. 2004 జనవరిలో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 'సింహాద్రి' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో అప్పట్లో 'ఆంధ్రావాలా'పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఆడియో ఫంక్షన్ కి అయితే లక్షల్లో జనాలు వచ్చారు. ఇప్పటికీ దానిని రికార్డుగా చెబుతారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏమాత్రం అందుకోలేక పరాజయంపాలైంది. అలాంటి సినిమాని 19 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రీరిలీజ్ చేయబోతున్నారు. వీజేఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ.. ఈ మార్చిలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
'ఆంధ్రావాలా'ను రీరిలీజ్ చేస్తుండటంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఆది', 'సింహాద్రి' వంటి సినిమాలను వదిలేసి ఈ చిత్రాన్ని విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్స్, ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఫ్యాన్స్ ని అలరించేలా ఉంటాయి. మరి వాటి కోసమైనా ఫ్యాన్స్ మళ్ళీ థియేటర్స్ కి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారో లేదంటే అసలు పట్టించుకోరో చూడాలి.