English | Telugu
తెలుగువాళ్లు టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నారంటున్న జయమ్మ!
Updated : Feb 15, 2023
జయమ్మ జయమ్మ గుండెల్లో గోలమ్మ అని అప్పుడెప్పుడో బాలయ్య పాడిన పాటని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత జయమ్మ అనే పేరు ఆ రేంజ్‌లో పాపులర్ అయింది క్రాక్ సినిమాలోనే. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాలో జయమ్మ కేరక్టర్ చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అంతకు ముందు అడపాదడపా ఆమె తెలుగులో సినిమాలు చేసినా క్రాక్ సినిమా మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చింది.
ఆ తర్వాత నాంది సినిమాలో చేసిన లాయర్ కేరక్టర్ కూడా వరలక్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టింది. రీసెంట్‌గా యశోద సినిమాలో మధు కేరక్టర్‌లో నటించారు వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డిలో భానుమతి పాత్ర పోషించారు వరలక్ష్మి.గతంలో కాస్త బొద్దుగా కనిపించిన వరలక్ష్మి, దీక్షగా వ్యాయామాలు చేసి నాజూగ్గా మారారు. ఆమె కోసం స్పెషల్‌గా కేరక్టర్లు రాస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా వీరసింహారెడ్డిలో భానుమతి కేరక్టర్ ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆమె నటించిన కొండ్రాల్ పావమ్ అనే సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. మార్చి 3న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడారు. ``ఈ చిత్రంలో మల్లికా అనే కేరక్టర్ చేశాను. ఒక ఇంట్లో ఓ రోజు జరిగే థ్రిల్లర్ చిత్రమిది. 1980లో జరిగే కథే అయినా, అన్నీ తరాల వారికీ నచ్చే సినిమా అవుతుంది. కన్నడలో ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ హిట్ అయింది. ప్రస్తుతం తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను. తెలుగువారు నన్ను ప్రోత్సహిస్తున్నారు. అక్కడ నాకు చాలా మంచి రోల్స్ రాస్తున్నారు. పారితోషికం విషయంలోనూ హ్యాపీగా ఉన్నాను. టాలెంటెడ్ పీపుల్‌ని తెలుగువారు గౌరవిస్తున్నారు`` అని అన్నారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిగా పరిచయమైంది తమిళ సినిమా ద్వారానే. అయితే ఇప్పుడు తెలుగు నేర్చుకుని, తన పాత్రలకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు.