English | Telugu
ఎన్టీఆర్ కే జాన్వీ ఓటు.. ఆనాటి రాముడు, ఈనాటి మనవడు!
Updated : Mar 7, 2023
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'ఎన్టీఆర్ 30' సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈమె ఇప్పటిదాకా ఒక్క తెలుగు సినిమా కూడా చేయనప్పటికీ.. ఎప్పటినుంచో తెలుగులో ఆమె పేరు మారుమోగుతోంది. ఓ వైపు ఆమె శ్రీదేవి కూతురు కావడం, మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్ విందుతో యువతను ఆకట్టుకోవడంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఫలానా సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం కానుంది అంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన 'లైగర్'లో జాన్వీ హీరోయిన్ గా నటించనుంది అంటూ అప్పట్లో బలంగా వార్తలు వినిపించాయి. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. ఆమె స్థానంలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందాల్సి ఉన్న 'ఐకాన్'లో కూడా హీరోయిన్ గా జాన్వీ పేరే వినిపించింది. కానీ అసలు ఆ సినిమానే పట్టాలెక్కలేదు. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఎస్ఎస్ఎంబి 28' లోనూ మొదట జాన్వీ నటించనుందని ప్రచారం జరిగింది. కానీ అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా జాన్వీ పేరు ఖరారైందని కొంతకాలంగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలైనా నిజమేనా? లేక మళ్ళీ ప్రచారానికే పరిమితమవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ జాన్వీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 6న ఆమె 'ఎన్టీఆర్ 30'లో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఆమె టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్- శ్రీదేవి జోడికి మంచి క్రేజ్ ఉండేది. వారి కాంబినేషన్ లో పదికి పైగా సినిమాలు రాగా.. అందులో మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. ముఖ్యంగా 'వేటగాడు', 'సర్దార్ పాపారాయుడు', 'కొండవీటి సింహం', 'బొబ్బిలి సింహం' వంటి సినిమాలు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అప్పుడు పెద్ద ఎన్టీఆర్- శ్రీదేవి జోడి ఎలాగైతే మెప్పించిందో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ జోడి కూడా అదే స్థాయిలో అలరిస్తుందని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే అది ఆమెకు తెలుగులో రెండో సినిమా అయ్యే అవకాశముంది.