English | Telugu
'ప్రాజెక్ట్ కె' మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సత్తా ఇదే!
Updated : Mar 7, 2023
తెలుగులో ఇంతదాకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే క్రేజ్ సంపాదించుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. అతను మ్యూజిక్ అందించిన తొలి తెలుగు చిత్రం 'దసరా' మార్చి 30న విడుదలవుతోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌తో సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందరి నోళ్లలో నానుతోంది. ఈ సినిమాతో పాటు వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న 'సైంధవ్' మూవీకి కూడా సంతోష్ మ్యూజిక్ ఇస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు కాకుండా మరో భారీ, క్రేజీ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తూ వార్తల్లో నిలిచాడు సంతోష్. ఆ సినిమా ఇంకేదో కాదు.. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే, దిశా పటానీ లాంటి పేరుపొందిన తారలు నటిస్తోన్న 'ప్రాజెక్ట్ కె'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాపై వెల్లువెత్తుతున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం మ్యూజిక్ డైరెక్టర్‌గా మిక్కీ జె. మేయర్‌ను ఎంచుకున్నారు మేకర్స్. అయితే ఆ తర్వాత సినిమాకు అతను న్యాయం చేయలేడేమో అని భావించి, సంతోష్ నారాయణన్‌ను తీసుకున్నారు. దీంతో ఎవరీ సంతోష్ అంటూ అందరూ ఆరాలు తీస్తూ వస్తున్నారు.
తమిళనాడులోని తిరుచురాపల్లిలో పుట్టి పెరిగి అక్కడే కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడైన సంతోష్.. మొదట రికార్డింగ్ ఇంజినీర్‌గా, ప్రోగ్రామర్‌గా పనిచేశాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ దగ్గర అసిస్టెంట్‌గాచేశాడు. 2012లో వచ్చిన పా. రంజిత్ మూవీ 'అట్టకత్తి'తో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమై తమిళ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. నిజానికి అతను మొదట ఒక తెలుగు షార్ట్ ఫిలింకు మ్యూజిక్ ఇచ్చాడనే విషయం చాలామందికి తెలీదు. ప్రదీప్ మాడుగుల రూపొందించిన ఆ షార్ట్ ఫిల్మ్ పేరు 'అద్వైతం'. సురేష్ ప్రొడక్షన్స్ ప్రమోట్ చేసిన ఈ ఫిల్మ్ జాతీయ అవార్డు సైతం అందుకుంది.
ఆ తర్వాత 'పిజ్జా మూవీ'తో మరోసారి సంచలనం సృష్టించాడు సంతోష్. ఆ సినిమాకు అతను అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అందరూ ఫిదా అయిపోయారు. సూదు కవ్వం, పిజ్జా 2, జిగర్తాండ, ఎనక్కుల్ ఒరువన్, 36 వాయతినిలే, కబాలి, భైరవ, కాలా, వడ చెన్నై, కర్ణన్, సర్పట్ట పరంబరై, మహాన్ సినిమాలు సంతోష్ ప్రతిభకు గీటురాళ్లు. ఇవాళ తమిళ చిత్రసీమ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో సంతోష్ ఒకడు. అందుకే 'ప్రాజెక్ట్ కె'కు అతడిని మ్యూజిక్ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించదు. ఈ సినిమాకు అతనిచ్చే మ్యూజిక్ ఏ రేంజిలో ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అతడికి వస్తున్న ఆఫర్స్‌తో ఇక్కడి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీప్రసాద్, తమన్‌లకు గట్టి పోటీ ఎదురవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.