English | Telugu
తమిళ్ అంటే అంత మోజా? తెలుగును పక్కన పెట్టడానికి అదేనా రీజన్ ?
Updated : Sep 15, 2023
టాలీవుడ్ కమెడియన్స్‌లో సునీల్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ డిఫరెంటే. కమెడియన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమై ఫిజికల్‌గా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే హీరోగా అంతగా సక్సెస్ కాకపోగా, అప్పటివరకు కమెడియన్‌గా తనకు ఉన్న స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు, కమెడియన్‌గా అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఆ టైమ్‌లో అటు హీరోగా, ఇటు కమెడియన్‌గా అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక హీరోగా తన ప్రయత్నాన్ని విరమించుకొని మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు కనిపిస్తూ మెల్లగా సినిమాల సంఖ్య పెంచుకుంటూ వచ్చాడు.
‘పుష్ప’ చిత్రంలో విలన్‌గా ఓ కొత్త అవతారం ఎత్తిన సునీల్ ఆ సినిమాలోని తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ మెప్పించాడు. ఇక ఆ సినిమా నుంచి కమెడియన్‌గా కాకుండా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత 2022 సంవత్సరంలోనే 17 సినిమాల్లో వివిధ రకాల క్యారెక్టర్స్ చేశాడు సునీల్.
తాజాగా అతని దృష్టి తమిళ్ సినిమాలవైపు మళ్ళింది. శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ‘మహావీరన్’ చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత వరసగా తమిళ్ ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల వచ్చిన రజనీకాంత్ మూవీ ‘జైలర్’లోనూ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. తమిళ్‌తోపాటు పాన్ ఇండియా మూవీస్ ‘పుష్ప2’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సడన్‌గా సునీల్ తమిళ్ ఇండస్ట్రీపై దృస్టి పెట్టడంపై పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగులో అతనికి అవకాశాలు సన్నగిల్లాయా? తెలుగువారు సునీల్‌ని వద్దనుకున్నారా? లేక తెలుగు కంటే తమిళ్ బెటర్ అని సునీలే అనుకున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక విధంగా చూస్తే ఇటీవల తెలుగులో అతను చేసిన క్యారెక్టర్స్ కంటే తమిళ్‌లోనే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయనేది అతను చేసిన సినిమాలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం సునీల్ తెలుగులో పుష్ప2, గేమ్ ఛేంజర్ వంటి సినిమాలు తప్ప స్ట్రెయిట్‌గా తెలుగులోనే రూపొందే సినిమా ఒక్కటి కూడా చెయ్యడం లేదు. అందుకు గల కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. తెలుగులో అతనికి అవకాశాలు రాకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.