English | Telugu

అతను రాసిన కథతోనే అసలు సమస్య మొదలైందా?

ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవల వచ్చిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో కనిపించారు. తాజాగా భరత్‌ వై.జి. దర్శకత్వంలో ప్రవీణ్‌ సత్తారు నిర్మిస్తున్న ‘అతిథి’ వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వేణు, అవంతిక మిశ్రా, వెంకటేశ్‌ కాకుమాను, భద్రం, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీ హాట్‌ స్టార్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటివరకు వచ్చిన హారర్‌ థ్రిల్లర్స్‌లో ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ రూపొందిందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది.

‘చాలా ఏళ్ళ కిందట ఒక అమ్మాయి ప్రేమించినోడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి సంది ఈ దోవకుంతన 10 కిలోమీటర్ల అవతల ఉన్న మెట్ట కాడ ఆగి వచ్చిపోయేవాళ్ళను అంటుకుంటా ఉంటది’ అని వాయిస్‌ ఓవర్‌ వచ్చిన తర్వాత అప్పటివరకు టైప్‌ మిషన్‌లో టైప్‌ చేస్తున్న వేణు ‘ఎలా వుంది?’ అని అడగడం, దానికి అవంతిక మిశ్రా ‘ఎప్పట్లానే ఉంది. ఈ జనరేషన్‌కి తగ్గట్టు రాయొచ్చుగా’ అంటూ ఓ లేడీ వాయిస్‌ వినిపిస్తుంది. దీన్ని బట్టి ఈ కథలో వేణు ఒక రైటర్‌ అని అర్థమవుతుంది. అతను రాసిన కథ వల్లే ఏదో జరుగుతుందనేది ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ని తీసుకొని ఈ వెబ్‌సిరీస్‌ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత హారర్‌ సీన్స్‌, తదితర సన్నివేశాలు మామూలుగానే ఉన్నా కొత్తగా ఏదో ట్రై చేశారనిపిస్తుంది. మనోజ్‌ కాటసాని సినిమాటోగ్రఫీ, కపిల్‌కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ వెబ్‌ సిరీస్‌కి ప్లస్‌ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 19న స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌ వేణు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఎంతవరకు ప్లస్‌ అవుతుందో చూడాలి.