English | Telugu

ముదురుతున్న ఎ.ఆర్‌.రెహమాన్‌ వివాదం.. కంగనా కామెంట్స్‌ వైరల్‌!

భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఎ.ఆర్‌.రెహమాన్‌ అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మతపరమైన వివాదం ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మతం కారణంగానే తనకు అవకాశాలు తగ్గిపోయాయి అంటూ రెహమాన్‌ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

దేశ ప్రజల ఆదరణవల్లే రెహమాన్‌ ఆస్కార్‌ స్థాయికి వెళ్ళగలిగారనే విషయాన్ని మరచి తన వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెహమాన్‌ సంగీతాన్ని ప్రేమించేవారు, ఆయన్ని అభిమానించేవారు సైతం ఆయన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. మూడు దశాబ్దాలపాటు సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న రెహమాన్‌కి ఇంతకాలం మతం ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నిస్తున్నారు.

వ్యక్తిగత కారణాలు, భార్యతో విడాకులు, ఇతర కారణాల వల్ల తన సంగీతంపై శ్రద్ద పెట్టలేకపోతున్నారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు మతం అంటూ చిల్లర కామెంట్స్‌ చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ వివాదం మరింత ముదురుతోందని గ్రహించిన రెహమాన్‌.. తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ తాజాగా ఒక వీడియో విడుదల చేశారు.

రెహమాన్‌ వివరణ ఇచ్చినప్పటికీ అతను చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. దాంతో ఒక్కొక్కరుగా రెహమాన్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా కంగనా రనౌత్‌ దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు పరిశ్రమలో ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నాను. కానీ, మీ కంటే ఎక్కువ పక్షపాతం చూపే ద్వేశపూరితమైన వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు’ అని పోస్ట్‌ పెట్టారు.

తన సినిమాకు సంగీతం అందించాల్సిందిగా కోరుతూ కథ వినిపించేందుకు రెహమాన్‌ను సంప్రదించానని, కనీసం తనను కలిసేందుకు కూడా రెహమాన్‌ నిరాకరించారని అన్నారు కంగనా. తను చేసిన ఎమర్జెన్సీ చిత్రాన్ని ఒక ప్రాపగాండగా రెహమాన్‌ అభివర్ణించారని అన్నారు. మా సినిమాను మాస్టర్‌ పీస్‌ అని అందరూ మెచ్చుకున్నారని, రెహ్మాన్‌ మాత్రం తన ద్వేషంతో గుడ్డివాడైపోయారని ఆమె మండిపడ్డారు.

ఛావా సినిమా గురించి మాట్లాడుతూ ‘విభజనను ప్రేరేపించే సినిమా’ అని రెహమాన్‌ వ్యాఖ్యానించడమే కంగనా అంతలా ఫైర్‌ అవ్వడానికి కారణం. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినప్పటికీ కంగనా చేసిన ఆరోపణలపై రెహమాన్‌ ఇప్పటివరకు స్పందించలేదు.