English | Telugu
ఇళయరాజా.. నీకిది తగునా...??
Updated : Jul 15, 2015
స్వరరాజా ఇళయరాజాకు కోపం వచ్చింది. అదీ.. ఓ వర్థమాన గీత రచయితపై. అతను పాటలు రాస్తానంటే... ఆ సినిమాకి నేను స్వరాలు సమకూర్చను... అని మెండికేశారు ఈ స్వరజ్ఞాని. ఇన్ని దశాబ్దాలలో, ఆయన స్వరపరిచిన వందల చిత్రాలలో ఎప్పుడూ ఆయన నుంచి ఇలాంటి మాట వినలేదు. అందుకే యావత్ తమిళ చిత్రసీమ, సంగీత ప్రపంచం షాక్ తింది.
ఇంతకీ ఆ దురదృష్టవంతుడెవరంటే.. మదన్ కార్కీ. ప్రకాష్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న 'ఉన్ సమయల్ అరైయల్' చిత్రానికి మదన్ కార్కీతో పాటలు రాయించాలని భావించింది చిత్రబృందం. మదన్ పాటలు రాస్తే తాను ఈ సినిమా నుంచి తప్పుకొంటానని ఇళయరాజా హెచ్చరించారట. ఆ స్వరజ్ఞాని మాట కాదనలేక మదన్‌ని ఈ సినిమా నుంచి తప్పించారు. ఇంతకీ ఈ గీతరచయిత చేసిన తప్పేంటో తెలుసా..??? ప్రఖ్యాత తమిళ గీత రచయిత, సరస్వతీ పుత్రుడైన వైరముత్తుకి కొడుకుగా పుట్టడమే.
వైరముత్తు - ఇళయరాజా కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలొచ్చాయి. ఈ జోడీ... సంగీత ప్రియుల్ని దశాబ్దాలుగా అలరించింది. అయితే ఇద్దరి మధ్య విబేధాలు మొదలై.. దూరమైపోయారు. ఇప్పుడు వైరముత్తు - ఇళయరాజా కలసి పనిచేయడం లేదు. అందుకే వైరముత్తు తనయుడితోనూ పనిచేయనని ఇళయరాజా మొండికేశారట. తండ్రిమీదున్న కోపం తనయుడిపై చూపించడం భావ్యంకాదని తమిళ సినీ వర్గాలు సైతం ఆక్షేపిస్తున్నాయి. ఇళయరాజాలాంటి మహా జ్ఞాని.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం ఏమిటని విస్మయానికి గురవుతున్నాయి. మరి వైరముత్తుపై ఇళయరాజాకి కోపం ఎప్పుడు చల్లారుతుందో.. ఈ అడ్డుగోడలెప్పుడు తొలగిపోయాయో కాలమే చెప్పాలి.