English | Telugu
మెగా బ్రాండ్ ని నమ్మి చేతులు కాల్చుకున్న అనిల్ సుంకర.. నిర్మాత చాట్ లీక్!
Updated : Aug 14, 2023
'ఆచార్య' ఘోర పరాజయం సమయంలో.. దర్శకుడు కొరటాల శివ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడని, దాంతో డైరెక్షన్ మీద ఫోకస్ తగ్గి సినిమా డిజాస్టర్ అయిందని కొందరు విమర్శలు చేశారు. మొత్తానికి 'ఆచార్య' పరాభవానికి కొరటాలే కారణమని ఆ సమయంలో బలమైన ముద్ర పడింది. ఇప్పుడు 'భోళా శంకర్' విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి నిర్మాత అనిల్ సుంకరకి నష్టం కలిగించారని ప్రచారం జరుగుతోంది.
ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా 'భోళా శంకర్'ని ప్రకటించినప్పుడే మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ చిరంజీవి వెనకడుగు వేయకుండా 'భోళా శంకర్'ని పూర్తి చేశారు. అయితే అసలు ఈ సినిమా ఎంపికే చిరు చేసిన తప్పిదమంటే.. బిజినెస్ లో కూడా ఇన్వాల్స్ అయ్యి, నిర్మాతను నష్టాలపాలు చేశారనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. మెగాస్టార్ మొదట ఈ సినిమాలో వాటా అడిగారట. ఏవైనా ఏరియా రైట్స్ ఇవ్వొచ్చు లేదా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగాక ఆయన వాటాను ఆయనకు ఇవ్వొచ్చు అనే ఆలోచనతో.. ఇందులో పెద్దగా రిస్క్ ఉండదు కాబట్టి వాటా ఇవ్వడానికి అనిల్ సుంకర సంతోషంగా ఒప్పుకున్నారట.
అయితే కొంతభాగం షూటింగ్ జరిగాక తనకు వాటా వద్దని, రూ.60 కోట్ల రెమ్యునరేషన్ కావాలని చిరు చెప్పారట. అంతటి స్టార్ ని కాదనలేక.. ఆస్తులు తాకట్టు పెట్టిమరీ ఫైనాన్స్ తెచ్చి రెమ్యునరేషన్ చెల్లించారట అనిల్. అంతటితో అయిపోలేదు. సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మాలనుకున్నప్పుడు.. నైజాం నుంచి రూ.20 కోట్ల రేంజ్ లో ఆఫర్ రాగా.. అనిల్ రైట్స్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారట. కానీ చిరు మాత్రం తన గత చిత్రం 'వాల్తేరు వీరయ్య' నైజాంలో రూ.35 కోట్ల దాకా షేర్ రాబడితే.. అంత తక్కువకి ఎలా ఇస్తావని అన్నారట. దీంతో నైజాంతో పాటు పలు ఏరియాల్లో అనిల్ సొంతంగా విడుదల చేసుకున్నారు. కానీ భోళా ఇప్పటిదాకా నైజాంలో రూ.6.50 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి.. ఫుల్ రన్ లో రూ.10 కోట్ల షేర్ కూడా కష్టమే అనేలా ఉంది. మిగతా ఏరియాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పెద్దగా అంచనాల్లేని రీమేక్ సినిమా అయినప్పటికీ.. మెగాస్టార్ బ్రాండ్ ని అతిగా నమ్మి, సొంతంగా విడుదల చేసి నిర్మాత అనిల్ సుంకర చేతులు కాల్చుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా మెగాస్టార్ ని, ఆయన బ్రాండ్ ని నమ్ముకొని నిర్మాత అనిల్ సుంకర నష్టపోయారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. అందులో ఎలాంటి వాస్తవం లేదని అనిల్ సుంకర చెప్పినట్లు తెలుస్తోంది. ఓ మెగా అభిమాని "చిరంజీవి కారణంగా మీరు ఇబ్బంది పడినట్లు వార్తలొస్తున్నాయి" అని మెసేజ్ చేయగా.. "అలాంటి వార్తలను పట్టించుకోకండి. చిరంజీవి గారితో మరో సినిమా చేస్తున్నాను. సినిమాతోనే అందరికీ సమాధానం చెబుదాం" అని అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.