English | Telugu
'జవాన్'కి పోటీగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'!
Updated : Aug 14, 2023
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని మొదట ఆగస్టు 4 న చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమవ్వడంతో సినిమాని వాయిదా వేశారు. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాని సెప్టెంబర్ 7న విడుదల చేస్తున్నట్లు సోమవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జ్యోతిష్యుడు గెటప్ లో ఉన్న రంగస్థలం మహేశ్ ను 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రిలీజ్ డేట్ చెప్పమని అడగడం, అతను 70-80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకోమని అనడం.. చివరకు నవీన్ 'హే కృష్ణా' అంటూ ఉట్టికొట్టి కృష్ణాష్టమికి మా సినిమాను తీసుకొస్తున్నాం అని ప్రకటించడం మెప్పించింది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కాగా సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ 'జవాన్' విడుదల కానుంది. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదలవుతుంది. మరి 'జవాన్' జోరుని తట్టుకొని 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.