English | Telugu
హాయ్ నాన్న.. ఆ ఇంగ్లీష్ సినిమాకి కాపీనా?
Updated : Dec 6, 2023
ఈ శుక్రవారం 'హాయ్ నాన్న' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు నేచురల్ స్టార్ నాని. శౌర్యువ్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో నానితో పాటు మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. 'దసరా' వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని నటించిన ఈ క్లాస్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న 'హాయ్ నాన్న' సినిమాలో బలమైన భావోద్వేగాలు ఉంటాయని ప్రచార చిత్రాలతోనే అర్థమైపోయింది. అలాగే ట్రైలర్ ని బట్టి చూస్తే, నాని తన భార్యతో విడిపోయి తన పదేళ్ల కూతురితో కలిసి జీవిస్తుంటాడు. అసలు తన తల్లిదండ్రుల మధ్య ఏం జరిగింది? తల్లి ఎక్కడుంది? అని కూతురు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఇలా ట్రైలర్ ఓ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ లా సాగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి.
2008లో 'Definitely, Maybe' అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. 15 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ కి, ఇప్పటి 'హాయ్ నాన్న'కి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. 'Definitely, Maybe'లో కూడా హీరో పాత్రధారి తన భార్యతో విడిపోయి, కూతురితో కలిసి ఉంటాడు. అసలు వారు ఎలా కలిశారు? ఎలా విడిపోయారు? అనేది హీరో తన కూతురితో చెబుతున్నట్టుగా కథ సాగుతుంది. 'హాయ్ నాన్న' ట్రైలర్ కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. మరి 'Definitely, Maybe'ని స్ఫూర్తిగా తీసుకొని 'హాయ్ నాన్న' చేశారా లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.