English | Telugu
దిల్‌రాజు సినిమా ఒప్పుకొని ఇబ్బంది పడుతున్న హీరోయిన్
Updated : Dec 2, 2023
టాలీవుడ్‌లో దిల్‌రాజు అంటే టాప్ ప్రొడ్యూసర్... అతని సినిమాలో నటించడం ఏ హీరోయిన్‌కైనా హ్యాపీయే కదా.. మరి ఇబ్బంది దేనికి? అని అందరూ అనుకోవచ్చు. కానీ, సినిమా ఇండస్ట్రీలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎవరు ఎవరినైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి అనుకోని పరిస్థితి దిల్‌రాజుకు కూడా ఎదురైనట్టుంది. అందుకే ఇవానా అనే హీరోయిన్‌ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు.
వివరాల్లోకి వెళితే.. తమిళ్‌లో ‘లవ్ టుడే’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇవానా. లో బడ్జెట్‌తో 2022లో విడుదలైన ‘లవ్‌టుడే’ చిత్రం సూపర్‌హిట్ అయి రూ.100 కోట్ల కలెక్షన్ సాధించింది. తెలుగులోనూ ఈ సినిమా అదే పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తన నటనతో అందర్నీ ఇంప్రెస్ చేసిన ఇవానాకు తమిళ్‌లో వరస అవకాశాలు వచ్చాయి. లవ్‌టుడే తర్వాత చేసిన ఎల్‌జిఎం కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఇవానా తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తోంది. ఏ భాషకు చెందిన హీరోయిన్ అయినా టాలీవుడ్‌లో సినిమా చెయ్యాలని ఉత్సాహం చూపిస్తుంది. అలాగే ఇవానా కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు మంచి అవకాశం కోసం ఎదురుచూసింది. అయితే ఆ అవకాశం దిల్‌రాజు సినిమా రూపంలో వచ్చింది. ఇంకేముంది.. ఎంతో సంతోషంగా ఈ సినిమాను ఒప్పుకుంది.
దిల్‌రాజు అన్న కుమారుడు ఆశిష్ హీరోగా రూపొందుతున్న ‘సెల్ఫిష్’ చిత్రంతో ఇవానా హీరోయిన్ తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమా ప్రారంభమై ఏడాది కావస్తోంది. అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం ఇవానాకు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరే ఇతర సినిమా షూటింగ్‌లో పాల్గొనకూడదని అగ్రిమెంట్‌లో కండిషన్ పెట్టారట. ఈ విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఇవానాతో సినిమా చేసేందుకు ఓ దర్శకుడు ఆమెను కలిసి కథను వినిపించాడట. ఆ సమయంలోనే అగ్రిమెంట్‌లో ఉన్న కండిషన్ గురించి ఆ దర్శకుడు తెలుసుకున్నాడు. అయితే ఎలాగైనా దిల్‌రాజును ఒప్పించి ఇవానాతో సినిమా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఆ దర్శకుడు ఉన్నాడట. మరి ఈ విషయంలో దిల్‌రాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.