English | Telugu
'గాండీవధారి అర్జున' రివ్యూ: పస తక్కువ.. నస ఎక్కువ..!!
Updated : Aug 25, 2023
సినిమా పేరు: గాండీవధారి అర్జున
తారాగణం: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరేన్, రోషిణి ప్రకాశ్, మనీష్ ఛౌదరి, అభినవ్ గోమఠం, రవివర్మ, కల్పలత, బేబి వేద తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రాఫర్: ముఖేష్ జి (యు.కె)
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
బేనర్: ఎస్వీసీసీ సినిమా
విడుదల తేదీ: ఆగస్టు 25, 2023
చిత్ర నిడివి: 138నిమిషాలు (2 గంటల 18 నిమిషాలు)
'గద్దలకొండ గణేశ్' తరువాత సరైన విజయం లేని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఈ సారి 'గాండీవధారి అర్జున'గా పలకరించాడు. 'గరుడవేగ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తీసి.. 'ది ఘోస్ట్'తో దెబ్బతిన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు మళ్ళీ యాక్షన్ బాటలోనే వెళుతూ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. 'గాండీవధారి అర్జున'తో వరుణ్, ప్రవీణ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసినట్లేనా? తెలుసుకునే ముందు రివ్యూలోకి వెళదాం..
కథ:
ఆదిత్యరాజ్ (నాజర్) ఓ కేంద్రమంత్రి. గ్లోబల్ వార్మింగ్ కి కారణమైన ఓ పెద్ద కంపెనీపై రిపోర్ట్ తయారు చేసి యు.ఎన్.కి పంపుతాడు. దీంతో.. ఆదిత్యరాజ్ ని చంపబోతున్నట్లు బెదిరింపులు వస్తాయి. ఈ నేపథ్యంలో..ప్రైవేట్ ఏజెన్సీలో పనిచేసే అర్జున్(వరుణ్ తేజ్)ని తన సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించుకుంటాడు ఆదిత్య. అసలు ఆదిత్య రాజ్ ని చంపాలనుకున్నది ఎవరు? అతని ఉద్దేశం ఏంటి? ఆదిత్యని అర్జున్ కాపాడగలిగాడా? అర్జునతో ఐరా (సాక్షి వైద్య)కి ఉన్న బంధం ఎలాంటిది? తదితర ప్రశ్నలకు సమాధానమే 'గాండీవధారి అర్జున' చిత్రం.
విశ్లేషణ:
కెరీర్ ఆరంభంలో విభిన్న కథాంశాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు.. 'గరుడవేగ' తెచ్చిన గుర్తింపుతో పూర్తిగా యాక్షన్ మార్గంవైపే దృష్టిపెట్టాడు. అయితే, 'గరుడవేగ'లాగా మ్యాజిక్ చేయలేకపోతున్నాడన్నది.. గత చిత్రం 'ది ఘోస్ట్', తాజా సినిమా 'గాండీవధారి అర్జున'తో స్పష్టమైంది. వాస్తవానికి ప్రవీణ్ ఎంచుకున్న గ్లోబల్ వార్మింగ్ అంశం ఆసక్తికరమైనది, ఆలోచన రేకెత్తించేదే. అయితే, తెరకెక్కించిన విధానం మాత్రం సామాన్య ప్రేక్షకుడ్ని కట్టిపడేసేలా లేదు. "ఈ భూమికి పట్టిన అతిపెద్ద క్యాన్సర్.. మనిషే".. అంటూ అక్కడక్కడ బలమైన డైలాగ్స్ ని సంధించే ప్రయత్నం చేసిన ప్రవీణ్.. కథ, కథనాలపై మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే. తన సాంకేతిక బృందంలో మిక్కీ జే మేయర్ పాటలతో ఫర్లేదనిపించినా, నేపథ్య సంగీతంతో మాత్రంమెప్పించాడు. ముఖేష్ జి విజువల్స్ బాగున్నాయి. క్రిస్పీ రన్ టైమ్ తో ఎడిటర్ ధర్మేంద్ర కత్తెరకు బాగానే పదును పెట్టినా.. సినిమాలో కూర్చో బెట్టే పసలేదు.
నటీనటుల పనితీరు:
వరుణ్ తేజ్ ఎప్పటిలాగే తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో రాణించే ప్రయత్నం చేశాడు. సాక్షి వైద్యకి 'ఏజెంట్' తరువాత మరో నిరాశజనక పాత్ర దక్కింది. కథ ప్రధానంగా నాజర్ పాత్ర చుట్టే తిరుగుతుంది. సో.. తన పరిధి మేర అలరించే ప్రయత్నం చేశాడు. విలన్ గా నటించిన వినయ్ రాయ్ ఓకే అనిపించాడు. విమలా రామన్, రవి వర్మ, అభినవ్ గోమఠం.. వీరివి కూడా గుర్తుండిపోయే పాత్రలేమీకాదు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
యాక్షన్ జోనర్ లో తెరకెక్కిన 'గాండీవధారి అర్జున'.. క్రిస్పీ రన్ టైమ్ తో రూపొందినప్పటికీ టార్గెట్ ఆడియన్స్ నిసైతం మెప్పించలేకపోయింది. వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు, సాక్షి వైద్యకి మరో నిరాశజనక ఫలితం తప్పదనే చెప్పాలి. ఓవరాల్ గా.. ఈ అర్జునుడి గురి తప్పింది.
రేటింగ్: 2/5