English | Telugu
షాకింగ్.. ప్రముఖ హీరోలపై నిషేధం!
Updated : Sep 15, 2023
తమిళ సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు తమిళ హీరోలపై నిషేధం విధించింది. ఆ నలుగురు హీరోలు ఎవరో కాదు.. ధనుష్, శింబు, విశాల్, అధర్వ. వీరు కొత్త సినిమాల్లో నటించకుండా నిర్మాతల మండలి నిషేధం విధించింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న ధనుష్, శింబు, విశాల్, అధర్వ వంటి ప్రముఖ హీరోలపై నిషేధం విధించడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమా అంగీకరించి, కొంతభాగం షూటింగ్ పూర్తయ్యాక నిర్మాతలకు సహకరించట్లేదన్న ప్రధాన కారణంతో నిర్మాతల మండలి నటులపై నిషేధం విధించింది. 80 శాతం షూటింగ్ పూర్తయ్యాక, మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసేందుకు సహకరించడం లేదని నిర్మాత తేనాండాల్ ఫిర్యాదు మేరకు ధనుష్ పై చర్యలు తీసుకున్నారు. అలాగే సినిమా అంగీకరించి షూటింగ్ కి సహకరించట్లేదని శింబుపై నిర్మాత మైఖేల్ రాయప్పన్, అధర్వపై నిర్మాత మదియళగన్ ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరు హీరోలపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇక విశాల్ పై నిషేధానికి మాత్రం కారణం వేరే ఉంది. ఆయన నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో విశాల్ పై కూడా నిర్మాతల మండలి నిషేధం విధించింది. ఈ నలుగురితో పాటు నిర్మాతలకు సహకరించని కారణంగా విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య, వడివేలు, అమలా పాల్ వంటి పలువురు నటీనటులపై నిషేధం విధించాలని నిర్ణయించారు. మరి ఈ వ్యవహారంపై నడిగర్ సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.