English | Telugu

‘ఫాలిమీ’ మూవీ రివ్యూ

మూవీ: ఫాలిమీ
నటీనటులు: బసిల్ జోసెఫ్, జగదీష్, మంజు పిల్లై తదితరులు
ఎడిటింగ్: నిథిన్ రాజ్ అరోల్
సినిమాటోగ్రఫీ: బబ్లూ అజు
మ్యూజిక్: విష్ణు విజయ్
నిర్మాతలు : లక్ష్మీ వారియర్, గణేష్ మీనన్
దర్శకత్వం: నితీష్ సహదేవ్


మలయాళంలో విడుదలైన కొన్ని సినిమాలు తెలుగులో అందుబాటులోకి తీసుకొస్తున్నారు దర్శక, నిర్మాతలు. అందులో కొన్ని సింపుల్ గా క్యూట్ గా ఉంటున్నాయి. జయజయజయజానకి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన జోసెఫ్ ఈఫాలిమీ మూవీతో అలరించాడా లేదా ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం..

కథ:

రెమా, చంద్రన్ ఇద్దరు భార్యభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు.‌ చంద్రన్ వాళ్ళ నాన్నతో కలిసి అందరు సరదగా ఉంటారు. ప్రతీ మధ్యతరగతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవల మాదిరి రెమా, చంద్రన్ ల కుటుంబం జీవితం సాగుతుంటుంది. అయితే చంద్రన్ వాళ్ళ నాన్నకి కాశీకి వెళ్ళాలని ఉంటుంది. కాశీకి వెళ్ళడం కోసం మూడు సార్లు ఎవరికీ చెప్పకుండా ఇంటినుండి రైల్వేస్టేషన్ కి వెళ్తుండగా పట్టుకుంటారు. అయితే ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందని చంద్రన్ పెద్ద కొడుకు బాసిల్ ఒక డబ్బింగ్ స్టూడియోలో జాబ్ చేస్తుంటాడు. అతడికి ఎన్ని పెళ్ళిసంభంధాలు వచ్చినా ఏవీ సెట్ కావు. మరోవైపు చంద్రన్ చిన్నకొడుకు అల్లరిచిల్లరిగా తిరుగుతూ డబ్బులు వృధా చేస్తుంటాడు. చంద్రన్ ఫ్యామిలీ సహాకార బ్యాంక్ లో ఉన్న దాదాపు అన్నీ లోన్లని తీసుకొని వాటికి వడ్డీ కూడా కట్టలేని స్థితిలో చంద్రన్ ఫ్యామిలీ జీవితం సాగిస్తుంది. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో చంద్రన్ కుటుంబం కాశీకి బయల్దేరుతారు. మరి చంద్రన్ ఫ్యామిలీ కాశీకి వెళ్ళారా? ఆ ప్రయాణంలో వాళ్ళకెదురైన సవాళ్ళేంటనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఓ మధ్యతరగతి కుటుంబంలో ఉండే కలహాలు, ఆనందాలు, కామెడీ సన్నివేశాలు అన్నీ కలగలిపి చూపించడంలో డైరెక్టర్ నితీష్ సహదేవ్ సక్సెస్ అయ్యాడు. సినిమా కథ చాలా సింపుల్. ఒక ఇంటి పెద్ద కాశీకి వెళ్ళాలనుకుంటే ఆ ఇంటి సభ్యులు ఏం చేశారు? వారికి మధ్య జరిగిన గొడవలేంటి? ఆ ప్రయాణంలో ఆ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులేంటనేది కథ. మరి ఈ కథని మొదలెట్టడానికి కాస్త టైమ్ తీసుకున్నాడు డైరెక్టర్. కానీ ప్రథమార్ధంలో కుటుంబంలో వచ్చే సీన్స్ అన్నీ మనతో పాటు సాగుతున్న కథలా అనిపిస్తుంది. ప్రతీ సీన్ ని కామెడీగా మలిచారు. ప్రథమార్థం వరకు కాస్త నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ నుండి కథలో వేగం పెరుగుతుంది.

ఇంటర్వెల్ లో ఆ ఫ్యామిలీ అంతా రైలు నుండి దిగిపోయి.. వారి ఇంటిపెద్ద ట్రైన్ లో ఉండిపోవడంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. రెమా, చంద్రన్ ల మధ్య రైలులో సాగే సీక్వెన్స్ నవ్వు తెప్పిస్తాయి. పెద్ద ఫైట్స్, రొమాంటిక్ సాంగ్స్, మాస్ ఎలవేషన్ లు, ఎక్కడ అతి లేకుండా కథ సింపుల్ గా‌ అలా వెళ్తుంటుంది.

కథని‌ నడిపిన తీరు‌ బాగుంది. అడల్ట్ సీన్సు ఎక్కడ లేవు. అందరు ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమాని చూడొచ్చు. విజువల్ ప్రెజెంటేషన్ అండ్ కామెడీ రెండు సమపాళ్ళలో మేళవించి తీసారు మేకర్స్. అందుకేనేమో అందరికి ఇట్టే కనెక్ట్ అవుతుంది. చిన్న కథని అంతే తక్కువ నిడివితో డైరెక్టర్ బాగా తీర్చిదిద్దాడు. ఇడ్లీ, సాంబార్ లా.. ఈ కథలో తాత, మనవడి కాంబినేషన్ బాగుంది. ఈ సినిమాకి బబ్లూ అజు సినిమాటోగ్రఫీ అదనపు బలంగా మారింది. ట్రైన్ సీక్వెన్స్, కొండపర్వతాలు, కాశీలో కొన్ని సీన్స్..‌ఇలా ప్రతీ ఫ్రేమ్ కళ్ళకి కట్టినట్టుగా చాలా సహజంగా చూపించారు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ లో స్లోగా వచ్చే బిజిఎమ్ ఆకట్టుకుంది. విష్ణు విజయ్ అందించిన బిజిఎమ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. నిథిన్ రాజ్ అరోల్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

చంద్రన్ పెద్ద కొడుకుగా బాసిల్ జోసెఫ్ ఆకట్టుకున్నాడు. చంద్రన్ గా జగదీష్ పర్వాలేదనిపించాడు. చంద్రన్ భార్యగా మంజు పిల్లై ఒదిగిపోయింది. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్ :
సింపుల్ అండ్ క్యూట్ గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

✍️.దాసరి మల్లేశ్