English | Telugu

ఎన్నికల జోరు ముగిసింది.. ఇక సినిమాల హవా స్టార్ట్‌ కాబోతోంది!

గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి లోక్‌సభ ఎన్నికలు కూడా తోడవడంతో దేశ ప్రజలు ఎలక్షన్స్‌ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు. సినిమాల ఎంటర్‌టైన్‌మెంట్‌ని మించిన స్థాయిలో అక్కడి రాజకీయ పార్టీల్లో నెలకొన్న పరిస్థితులు ఎంతో ఆసక్తికరంగా మారడంతో సినిమాలపై ప్రజలు దృష్టి పెట్టలేదు. దీనికి తగ్గట్టుగానే సినిమా మేకర్స్‌ కూడా తమ సినిమాల రిలీజ్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు. ఈ సమయంలో చిన్న సినిమాలు తప్ప ఒక రేంజ్‌ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. మరో పక్క ఐపిఎల్‌ కూడా సినిమాలపై ప్రభావం చూపించింది. 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ కలిగించే విషయాలు సినిమాలు, రాజకీయాలు. ఈమధ్యకాలంలో అంతా ఎన్నికల హడావిడే కావడంతో సినిమాల జోలికి వెళ్ళకుండా కేవలం రాజకీయాలకు సంబంధించిన చర్చల్లోనే మునిగిపోయారు జనం. ఇప్పుడు ఎన్నికల వేడి తగ్గింది. కాబట్టి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలోపడ్డారు నిర్మాతలు. కొన్ని సినిమాల రిలీజ్‌ డేట్లు ఆల్రెడీ ఎనౌన్స్‌ చేసి ఉండడంతో వాటికి సంబంధించిన ప్రమోషన్స్‌కు స్పీడ్‌ పెంచారు. 

రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంఇంచిన టీజర్‌ను మే 15న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఈమధ్యకాలంలో రామ్‌కి, పూరికి సరైన హిట్‌ లేదు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’తో ఓ బిగ్‌ హిట్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారిద్దరూ. ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఎనౌన్స్‌ చేయలేదు. మే 15న విడుదలయ్యే టీజర్‌లోనే రిలీజ్‌ డేట్‌ను కూడా కనర్మ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఎంతోకాలంగా ప్రేక్షకులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘దేవర’. మే 20 ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇద్దరికీ డిఫరెంట్‌ ప్యాట్రన్‌ అనే చెప్పాలి. అదే రోజు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్‌ తొలిసారి నటిస్తున్న హిందీ సినిమా ‘వార్‌2’ ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ అవుతుందని సమాచారం. అలాగే ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ చేసే సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చే అవకాశం కూడా ఉందట. 

అన్నింటినీ మించి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ వరల్డ్‌ మూవీ ‘కల్కి 2898ఎడి’కి సంబంధించిన ప్రమోషన్స్‌ కూడా ఈ నెలలోనే స్టార్ట్‌ చెయ్యబోతున్నారు. అందులో భాగంగానే కొన్ని ఈవెంట్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌. సోషల్‌ మీడియాతోపాటు నేషనల్‌ మీడియాలో కూడా కల్కి చిత్రానికి సంబంధించి రకరకాల ప్రమోషన్స్‌ను చెయ్యబోతున్నారు. ఫ్యాన్స్‌ మీట్‌ అనే ఓ సరికొత్త ఈవెంట్‌ను ఈ సినిమా కోసం ప్లాన్‌ చేశారు. దీని ద్వారా ప్రేక్షకుల్లోకి సినిమా బాగా వెళుతుందన్న నమ్మకం చిత్ర యూనిట్‌కి ఉంది. చిత్రాన్ని జూన్‌ 27న రిలీజ్‌ చేస్తుండగా, ఈ నెలలోనే ఫస్ట్‌ సింగిల్‌తోపాటు మూవీ గ్లింప్స్‌ను కూడా రిలీజ్‌ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. వీటితోపాటు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రానికి ఇప్పటికే చాలా హైప్‌ క్రియేట్‌ అయింది. రకరకాల అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఈ సినిమా టీజర్‌ని కూడా ఈ నెలలోనే రిలీజ్‌ చేస్తున్నారు. ఎన్నికల హడావిడి ముగిసింది. జూన్‌ 4తో ఫలితాలకు సంబంధించిన జోరు కూడా ముగుస్తుంది. రాజకీయాల వేడి తగ్గుతుంది. అలాగే వాతావరణ కూడా చల్లబడుతుంది. ఇక అప్పుడు ఎలాంటి ఆటంకం ఉండదని భావిస్తున్న నిర్మాతలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.