English | Telugu

మరోసారి పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల మనసు గెలుచుకున్న ఎస్‌కెఎన్‌!

ఈసారి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న నేపథ్యంలో జనసేన పార్టీకి ప్రజల నుంచి సినీ ప్రముఖుల నుంచి పూర్తి మద్దతు లభించింది. ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌తోపాటు జనసేప పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు గత కొన్నిరోజులుగా తమ మద్దతును ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎపిలోని ఓ రిక్షా కార్మికుడి భార్య ఒక వీడియోలో చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి. పవన్‌కళ్యాణ్‌ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఎంతో సంతోషంగా చెప్పింది. ట్విట్టర్‌లో ఈ పోస్ట్‌ బాగా వైరల్‌ అయింది. ఆమె మాటల్లోని నిజాయితీ, పవన్‌కళ్యాణ్‌ పట్ల ఉన్న నిజమైన ప్రేమ ఈ పోస్ట్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది.

దీనిపై స్పందించిన ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్‌ ఆ మహిళా అభిమాని కోరుకున్నట్టుగానే జనసేన పార్టీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆమెకు ఒక ఆటో కొని ఇస్తానని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ట్వీట్‌కు డైరెక్టర్‌ మారుతి సహా పలువురు ఎస్‌కెఎన్‌ది గోల్డెన్‌ హార్ట్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. మెగా హీరోలకు ఎప్పుడూ అభిమాన పాత్రుడిగా ఉండే నిర్మాత ఎస్‌కెఎన్‌ వారిపై తనకు ఉన్న ప్రేమను ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు మెగాభిమానులు హ్యాపీగా ఫీల్‌ అయ్యేలా చేస్తుంటారు. మెగా హీరోలకు మద్ధతుగా ఉండే ఎవరినైనా మనస్ఫూర్తిగా సపోర్ట్‌ చేస్తాడు. ఛారిటీ యాక్టివిటీస్‌లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ మహిళా అభిమాని తమ హీరో పవన్‌కళ్యాణ్‌పై చూపించిన ప్రేమకు స్పందించి ఆ కుటుంబానికి ఆటో కొనిస్తానని ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు ఎస్‌కెఎన్‌.