English | Telugu
దూరపు కొండలు నునుపు.. తెలుగు హీరోలను అవమానించిన నాని!
Updated : Aug 14, 2023
'దూరపు కొండలు నునుపు' అనే సామెతను నేచురల్ స్టార్ నాని మరోసారి నిజం చేశాడు. తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చితే ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తారు. అంతమాత్రాన మన హీరోలను తక్కువ చేసినట్లు కాదు. తెలుగు హీరోల సినిమాలను చూస్తూనే, కంటెంట్ నచ్చితే ఇతర భాషల హీరోల సినిమాలను కూడా ఆదరిస్తారు. కానీ నాని మాత్రం వేరే హీరోని పొగిడే క్రమంలో మన హీరోలను తక్కువ చేసి మాట్లాడాడు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పలు భాషల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మహానటి', 'సీతారామం' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. పలు భాషల ప్రేక్షకులకు చేరువయ్యాడు కాబట్టి అతన్ని పాన్ ఇండియా హీరో అనడంలో తప్పులేదు. కానీ అతను మాత్రమే పాన్ ఇండియా హీరో అంటేనే అసలు సమస్య వస్తుంది. తాజాగా నాని అలాంటి వ్యాఖ్యలే చేశాడు.
దుల్కర్ నటించిన 'కింగ్ ఆఫ్ కోత' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన నాని.. దుల్కర్ ని ఆకాశానికెత్తే క్రమంలో పరోక్షంగా తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడాడు. "నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ అంటే అది దుల్కర్ మాత్రమే. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం దర్శకులు దుల్కర్ కోసం కథలు రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇది నిజమైన నిర్వచనమని భావిస్తున్నాను." అన్నాడు.
పాన్ ఇండియా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తెలుగు హీరోల సినిమాలే. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ బాలీవుడ్ హీరోలను తలదన్నే క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నిలవడమే కాకుండా.. మామూలు సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూళ్లు రాబడుతున్నాడు. ప్రభాస్ డేట్స్ కోసం వివిధ పరిశ్రమలకు చెందిన మేకర్స్ ఎదురుచూస్తున్నారు. గత చిత్రం 'ఆదిపురుష్'ని హిందీ దర్శకుడితో చేశాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్' విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ కి బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ కూడా తమిళ దర్శకుడు శంకర్ తో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ వంటి తమిళ దర్శకులు ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ వంటి తెలుగు స్టార్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
పాన్ ఇండియా యాక్టర్స్ పరంగా క్రేజ్, రెమ్యునరేషన్, మార్కెట్ ఇలా ఏది చూసినా మన తెలుగు హీరోలే టాప్ లో ఉన్నారు. అలాంటిది దుల్కర్ ని పొగిడే క్రమంలో అతను మాత్రమే పాన్ ఇండియా యాక్టర్ అని నాని అనడం.. తెలుగు హీరోలను అవమానించేలా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే నాని పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకి నచ్చినవాళ్ళని పొగడటంలో తప్పులేదు. కానీ అతను మాత్రమే గొప్ప అని ఇతరులను తక్కువ చేసేలా మాట్లాడకూడదు. మరి ఈ వ్యత్యాసాన్ని నాని ఇకముందైనా తెలుసుకుంటాడో లేదో!.