English | Telugu
శంకర్ దర్శకత్వంలో సూర్య!
Updated : Aug 12, 2023
వెర్సటైల్ పాత్రలతో పాన్ రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ కథానాయకుడు సూర్య ఇప్పుడు ‘కంగువా’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన కోసం దర్శకుడు వెట్రిమారన్ లైన్‌లో ఉన్నారు. అలాగే సుధా కొంగర దర్శకత్వంలోనూ మరోసారి ఈ విలక్షణ హీరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి మరో ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూర్య సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని టాక్.
వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు కమల్ హాసన్‌తో ఇండియన్ 2 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్న డైరెక్టర్ శంకర్ నెక్ట్స్ వేల్పరి అనే సినిమాను కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో రామ్ చరణ్, యష్, రణ్‌వీర్ సింగ్, దళపతి విజయ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ క్రమంలో లేటెస్ట్‌గా వేల్పరి సినిమాను రణ్‌వీర్, సూర్యలతో శంకర్ తెరకెక్కిస్తారనే టాక్ వినిపిస్తోంది. సు వెంకటేశన్ రచించిన వేల్పరి పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. ఈ పుస్తకం ఐదు సంపుటాలు. మరి వేల్పరి సినిమాను శంకర్ ఎన్ని భాగాలుగా తెరకెక్కిస్తారనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే సూర్యతో శంకర్ సినిమా చేస్తే అది మరో రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. ఇదే కనుక నిజమైతే సూర్య ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు.
శంకర్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో ముందుగా ఇండియన్ 2 మూవీ వస్తుందని, ఆ తర్వాత గేమ్ ఛేంజర్ థియేటర్స్ సందడి చేయనుందని టాక్. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నాయి.