English | Telugu
'వారసుడు' కాంబినేషన్ లో మరో మూవీ!
Updated : Feb 20, 2023
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'వారిసు'(వారసుడు). మొదట ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనుందని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తర్వాత కేవలం తమిళ్ లో మాత్రమే తెరకెక్కించి తెలుగులోకి డబ్ చేశారు. తెలుగులో అంతగా ఆదరణ పొందనప్పటికీ తమిళ్ లో మాత్రం విశేష ఆదరణ పొందింది. ఈ సినిమా ఓవరాల్ గా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా.
'వారసుడు' కాంబినేషన్ లో మరో సినిమా రానుందని విడుదల సమయం నుంచే వార్తలొస్తున్నాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం విజయ్ తో మరో సినిమా ఉంటుందని ప్రమోషన్స్ సమయంలోలో చెప్పుకొచ్చారు. అనుకున్నట్లుగానే ఈ కాంబోలో మరో ప్రాజెక్ట్ సెట్ అయినట్లు సమాచారం. తాజాగా వంశీ ఒక కథను సిద్ధం చేసి దిల్ రాజుకి, విజయ్ కి వినిపించగా.. ఇద్దరికీ కథ నచ్చి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 'లియో' మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత వంశీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
విజయ్-వంశీ కాంబోలో రానున్న ఈ రెండో చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా ద్విభాషా చిత్రంగా రూపొందించాలని దిల్ రాజు భావిస్తున్నారట. ఇటీవల ధనుష్ నటించిన 'సార్'(వాతి) తెలుగు, తమిళ్ లో ద్విభాషా చిత్రంగా రూపొందింది. ధనుష్ మొదటి తెలుగు సినిమాగా ప్రచారం పొందిన ఈ చిత్రం.. తెలుగులో తమిళ్ కి సమానంగా వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. అందుకే విజయ్-వంశీ చిత్రాన్ని రెండు భాషల్లో రూపొందించి.. విజయ్ మొదటి తెలుగు చిత్రంగా ప్రచారం చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.