English | Telugu
నాగార్జున 100 విషయంలో కన్‌ఫ్యూజన్.. ఏది ముందు? ఏది వెనుక?
Updated : Dec 4, 2023
1986లో ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, భక్తిరస చిత్రాలు.. ఇలా అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం తన 99వ సినిమా ‘నా సామిరంగా’ చిత్రంతో రాబోతున్నాడు. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చెయ్యడమే లక్ష్యంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామాలో మెయిన్ హీరోయిన్‌గా ఆశికా రంగనాథ్ నటిస్తోంది. హీరోయిన్‌ని పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘బంగార్రాజు’ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడదే సెంటిమెంట్‌తో ‘నా సామిరంగా’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే ప్లాన్ చేశారు.
ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున చేయబోయే 100వ సినిమాపైనే అందరి దృష్టీ ఉంది. ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ తమ అభిమాన హీరో 100వ సినిమా ఎలా ఉండబోతోంది, ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడు అనే ఆసక్తి వారిలో ఉంది. అయితే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ పొలిటికల్ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ చేయబోయేది క్యామియో కాదని తెలుస్తోంది. ఒకరకంగా ఇది మల్టీస్టారర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది కాక అనిల్ అనే తమిళ దర్శకుడితో నాగ్ ఓ సినిమా చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించే ఈ సినిమాకి ‘లవ్ యాక్షన్ రొమాన్స్’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ జనవరి తర్వాత స్టార్ట్ అవుతుందట. ఓ పక్క ధనుష్ సినిమా, మరో పక్క లవ్ యాక్షన్ రొమాన్స్.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు కంప్లీట్ అయి రిలీజ్ అవుతుందో అదే నాగార్జున 100వ సినిమా అవుతుంది.