English | Telugu
కొత్త చిక్కుల్లో ఆదిపురుష్.. ముంబైలో కేసు
Updated : Apr 5, 2023
ప్రభాస్, కృతిసనన్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా మేకర్స్ మీద ముంబైలో కేసు ఫైల్ అయింది. సినిమాలో నటించిన ప్రభాస్, కృతిసనన్, దర్శకుడు ఓం రవుత్, సినిమా నిర్మాతల మీద సకినక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముంబై హైకోర్టు లాయర్లు ఆశిష్ రాజ్, పంకజ్ మిశ్రా ద్వారా సంజయ్ దిననాథ్ తివారి ఈ కేసు ఫైల్ చేశారు.
సనాతన ధర్మాన్ని సంరక్షించుకునే ఉద్దేశంతో కేసు ఫైల్ చేసినట్టు తెలిపారు. ఆయన ఇచ్చిన ప్రకటనలో ``హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ మేకర్స్ మీద కేసుపెట్టాం. సినిమాలో కొత్తగా విడుదల చేసిన పోస్టర్లో హిందువుల మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసే అంశాలున్నాయి. అందుకుగానూ ఇండియన్ పీనల్ కోడ్ 295(ఎ), 298, 500, 34 కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి. మర్యాద పురుషోత్తముడి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామచరిత మానస్‌లో హిందువులకు సంబంధించిన సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా వివరించారు.
కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రధాన పాత్రధారులకు జంధ్యం లేదు. సనాతన ధర్మం ప్రకారం పురాణ పురుషులు జంధ్యం ధరించడం పరిపాటి. అయితే ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో జంధ్యం ఎక్కడా కనిపించలేదు. ఈ తీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. సినిమా దర్శకుడు ఓం రవుత్, నిర్మాతలు, సినిమాలో నటించిన ప్రధాన నటీనటులు దీనికి జవాబు చెప్పి తీరాల్సిందే`` అని అందులో రాశారు.
ఆదిపురుష్ ఈ ఏడాది జనవరికి విడుదల కావాల్సింది. కానీ, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా వాయిదా పడింది. ప్రభాస్, కృతిసనన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు వివాదానికి లోనయిన పోస్టర్ని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. ఇటీవల వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మేకర్స్.