English | Telugu
టీజర్ కాదు 'బ్రో' ఇది.. మెగా విందు!
Updated : Jun 30, 2023
మెగా ద్వయం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
'బ్రో' టీజర్ గురువారం సాయంత్రం విడుదలైంది. చీకటిలో చిక్కుకొని ఒకరి సహాయం కోరుతున్న సాయి ధరమ్ తేజ్ వాయిస్‌తో టీజర్ మొదలవుతుంది. 'మాస్టర్', 'గురు', 'తమ్ముడు' అని రకరకాలుగా సంబోధిస్తూ.. చివరికి 'బ్రో' అని పిలవగా పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఎంట్రీ ఇస్తారు. టీ గ్లాస్ పట్టుకుని, 'తమ్ముడు' సహా తన ఇతర హిట్ చిత్రాలను గుర్తు చేస్తూ పవర్ స్టార్ అనేక రకాల లుక్స్ లో కనిపిస్తున్నారు. టీజర్ ఎంతో స్టైలిష్ గా, సరదాగా సాగిపోయింది. మేనమామ, మేనల్లుడు కాంబోని స్క్రీన్ మీద చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది. 'సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు' అంటూ కారులో పవన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ని ముగించిన తీరు భలే ఉంది. ఎస్ థమన్ ఆకట్టుకునే నేపథ్య సంగీతం, అందమైన విజువల్స్, పవన్ కామెడీ టైమింగ్‌తో.. జూలైలో మెగా అభిమానులకు వెండితెరపై విందు ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తుంది టీజర్.
తన మేనల్లుడితో పవన్ కళ్యాణ్ నటిసున్న మొదటి సినిమా కావడంతో 'బ్రో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో టైటిల్ పాత్రధారి 'బ్రో'గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ఫాంటసీ, ఆధ్యాత్మికత అంశాలతో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.