English | Telugu
రివ్యూ: బాయ్స్ హాస్టల్
Updated : Aug 26, 2023
మూవీ :బాయ్స్ హాస్టల్
నటీనటులు: మంజునాథ నాయక్, శ్రీవాత్సవ్, ప్రజ్వల్, గగన్ రామ్, శ్రేయాస్ శర్మ, రిషబ్‌శెట్టి, తరుణ్ భాస్కర్, రష్మీ తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్. కశ్యప్
ఎడిటింగ్: సురేష్ ఎం.
దర్శకత్వం: నితిన్ కృష్ణమూర్తి
గుల్మోహుర్ ఫిలింస్, వరుణ్ స్టూడియోస్
విడుదల తేదీ: 26 ఆగస్ట్, 2023
యూత్‌ఫుల్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ వుంటుంది. అందులోనూ ఒక డిఫరెంట్ టైటిల్‌తో సినిమా వచ్చిందంటే యూత్ ఆ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి సినిమాయే ‘బాయ్స్ హాస్టల్’. కన్నడలో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘హాస్టల్ హుడుగురు బేకాగిదరే’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేశారు. రష్మీ, తరుణ్ భాస్కర్లతోపాటు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, ఇంకా మరికొందరు స్టార్స్ ఈ సినిమాలో క్యామియో రోల్స్ ప్లే చేశారు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో సూపర్‌హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.
కథ :
అజిత్(ప్రజ్వల్) ఓ హాస్టల్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ ఉంటాడు. అతనికి ఒక మంచి షార్ట్ ఫిలిం తియ్యాలనే ఎయిమ్ ఉంటుంది. దాని కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో ఉంటాడు. ఆ కథలో తమను ఎప్పుడూ టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్ రమేష్‌కుమార్(మంజునాథ్ నాయక్) క్యారెక్టర్ని కూడా జోడిస్తాడు. అజిత్ ఫ్రెండ్స్ అందరూ కలిసి రమేష్‌ని చంపేసినట్టుగా కథలో రాసుకుంటాడు. కానీ, రమేష్ నిజంగానే చనిపోతాడు. అతని సూసైడ్ నోట్లో అజిత్, అతని ఫ్రెండ్స్ కారణంగానే తాను చనిపోతున్నానని ఉండడంతో అందరూ షాక్ అవుతారు. అసలు వార్డెన్ ఎలా, ఎందుకు చనిపోయాడు? అతని సూసైడ్ నోట్లో అజిత్, అతని ఫ్రెండ్స్ పేర్లు ఎందుకున్నాయి? అది నిజంగానే ఆత్మహత్యా? లేక ఎవరైనా హత్య చేశారా? ఈ ఘటనతో ఆ హాస్టల్లోని కుర్రాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నారు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక మంచి ట్విస్ట్‌తో ఈ కథను రన్ చేసేందుకు చేసిన ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో స్పీడ్‌గా ఉంటుంది. కొన్ని డైలాగులు ఆడియన్స్‌ని బాగా ఎంటర్టైన్ చేశాయి. సెకండాఫ్‌కి వచ్చేసరికి కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ బాగా ల్యాగ్ అనిపించడంతో ఆడియన్స్‌కి నీరసం వస్తుంది. ముఖ్యంగా యూత్‌ని బాగా నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే అంతగా వర్కవుట్ అవ్వలేదు. పైగా ఆ కామెడీ సీన్స్ అన్నీ ఎక్కడో చూసినట్టుగానే అనిపిస్తాయి.
నటీనటులు:
హాస్టల్ వార్డెన్‌గా నటించిన మంజునాథ్ నాయక్‌కి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ప్రజ్వల్, శ్రీవాత్సవ శ్యామ్లతోపాటు ఇతర హాస్టల్ బాయ్స్ కూడా బాగా చేశారు.
సాంకేతిక నిపుణులు:
అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా అనిపిస్తుంది. అంజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా వుంది. ఎడిటింగ్ వర్క్ కూడా ఫర్వాలేదు. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి విషయానికి వస్తే తను ఎంచుకున్న కథలో కొత్తదనం ఎక్కడా లేదు. అయితే టేకింగ్ మాత్రం బాగుంది. కొన్ని ఫన్నీ సీన్స్ డిజైన్ చేసిన విధానం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకున్నాయి. ఫస్ట్‌హాఫ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి డల్‌గా అనిపిస్తుంది. ఈ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.
తెలుగు వన్ పర్స్పెక్టివ్:
సినిమాలో కొన్ని ప్లస్సులు, కొన్ని మైనస్‌లు ఉన్నప్పటికీ టోటల్‌గా యూత్‌ని ఎంటర్టైన్ చేసే సినిమా అని చెప్పొచ్చు. మంజునాథ నాయక్ పెర్ఫార్మెన్స్, ఇతర ఆర్టిస్టుల నటన, కేమియో స్టార్స్ ఎంట్రీ ఇవ్వన్నీ సినిమాకు అదనపు ఆకర్షణలు అని చెప్పొచ్చు. దర్శకుడు రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ దాని చుట్టూ అల్లిన కథ, కామెడీ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటాయి. హాస్టల్ ఎట్మాస్ఫియర్‌ని యూత్ ఓన్ చేసుకుంటారు. సినిమాలో అక్కడక్కడ కొన్ని సీన్స్ లెంగ్తీ అయి బోర్ అనిపించినా కామెడీ సీన్స్ వల్ల కొంత వరకు యూత్ ఎంజాయ్ చేస్తారు.
(రొటీనే కానీ ఫన్ మూవీ)
రేటింగ్: 2.5/5
- జి.హరా