English | Telugu
'అఖండ-2'.. మినిమం వంద కోట్లు గ్యారెంటీ!
Updated : Aug 27, 2023
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో ఒకటి. వీరి కలయికలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ హ్యాట్రిక్ కాంబో నాలుగోసారి చేతులు కలపనుంది. వీరి కలయికలో రానున్న నాలుగో ప్రాజెక్ట్ 'అఖండ-2' కావడం విశేషం.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో 'అఖండ-2' ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన 'స్కంద' మూవీ ఈవెంట్ లో మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు బోయపాటి. 'అఖండ-2' ఖచ్చితంగా ఉంటుందని, కాకపోతే కాస్త టైం పడుతుందని అన్నారు. 'అఖండ-2' ఖచ్చితంగా ఉంటుందని తెలియడంతో బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. ఈసారి లెక్క వంద కోట్ల నుంచి మొదలవుతుందని అంటున్నారు.
లాక్ డౌన్ సమయంలో మళ్ళీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారోనని సినిమాలు విడుదల చేయడానికి అందరూ భయపడుతున్న టైంలో విడుదలైన 'అఖండ', ఏపీలో తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించి వరల్డ్ వైడ్ గా రూ.75 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటిది 'అఖండ-2' ఏస్థాయి సంచలనాలు సృష్టిస్తుందోనని అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. అసలే బాలయ్య-బోయపాటి కాంబోకి ఉన్న క్రేజ్, దానికితోడు 'అఖండ' సీక్వెల్, పైగా ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఈ లెక్కన 'అఖండ-2' మినిమం రూ.100 కోట్ల షేర్ రాబట్టడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.