English | Telugu
'అఖండ' కంటే ఎక్కువ.. 'వీరసింహారెడ్డి' కంటే తక్కువ!
Updated : Oct 17, 2023
'అఖండ', 'వీరసింహారెడ్డి' విజయాలతో జోరు మీదున్న నటసింహం నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్ పై కన్నేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ అందుకోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 'భగవంత్ కేసరి' థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. అయితే బాలయ్య గత చిత్రాలతో పోలిస్తే ఇది 'అఖండ' కంటే ఎక్కువ, 'వీరసింహారెడ్డి' కంటే తక్కువ కావడం విశేషం.
'అఖండ' రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, 'వీరసింహారెడ్డి' రూ.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక ఇప్పుడు 'భగవంత్ కేసరి' రూ.67.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.14.50 కోట్లు, సీడెడ్ లో రూ.13 కోట్లు, ఆంధ్రాలో రూ.29.60 కోట్ల బిజినెస్ చేసిన భగవంత్ కేసరి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.57.10 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.4.25 కోట్లు, ఓవర్సీస్ లో రూ.6 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.67.35 కోట్ల బిజినెస్ చేసింది.
రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'అఖండ' రూ.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలవగా.. రూ.73 కోట్ల బిజినెస్ చేసిన 'వీరసింహారెడ్డి' రూ.80 కోట్ల షేర్ తో ఘన విజయం సాధించింది. మరి ఇప్పుడు రూ.67.35 కోట్ల బిజినెస్ చేసిన 'భగవంత్ కేసరి' ఏ స్థాయి వసూళ్ళను రాబడుతుందో చూడాలి.